Lunar Eclipse 2023: గ్రహణాలకి - దర్భలకి ఏంటి సంబంధం, ఆహార పదార్థాలపై వేయకపోతే ఏమవుతుంది!
సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇంట్లో నీళ్లు, ఆహార పదార్థాలపై దర్భలు వేసి ఉంచుతారు. గ్రహణ నియమాల్లో ముఖ్యమైనది ఇదే. ఇంతకీ దర్భలను ఎందుకు వేయాలి...
Lunar Eclipse 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలను అశుభ చర్యగా పరిగణిస్తారు. గ్రహణం జాతక చక్రంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, జీవితంలో సమస్యలకు కూడా కారణమవుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులంటే.. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతోంది. చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపు మూసేస్తారు. ఆలయాల్లోకి ప్రవేశించరు..ఎలాంటి పూజలు నిర్వహించరు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్దరాత్రి సంభవించబోతోంది. పాక్షిక చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:04 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. అందుకే సూతకాలం సహా గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై దర్భలు వేయడం గమనించే ఉంటారు. ఇంతకీ దర్భలు ఎందుకు వేయాలి, దర్భలకు ఆహార పదార్థాలకు ఏంటి సంబంధం.
Also Read: ఇవాళే చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!
గ్రహణాలకి దర్భలకి ఏంటి సంబంధం
గ్రహణ సమయంలో సూర్యుడు, లేదా చంద్రుడు నుంచి రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంది. సాధారణంగా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు మనిషి శరీరంపైన శారీకంగానూ, మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 'ఆరోగ్యం భాస్కరాదిత్యేత్' అన్నట్లుగానే చంద్రుడిని 'మనః కారకుడు'గా చెబుతుంటారు. అలా సూర్య, చంద్రులిద్దరూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారు. గ్రహణ సమయంలో వారి శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే దర్భలను ఉపయోగించాలని చెబుతారు. ముఖ్యంగా తినే పదార్థాలపై దర్భలను ఉంచినట్లయితే ఆ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైంది కూడా.
Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!
దర్భలలో మూడు రకాలు
- మామూలు దర్భ జాతి - వీటిని అపరకర్మలలో వినియోగిస్తారు
- కుశ జాతి - ఈ దర్భలను శుభకార్యాలలో వినియోగిస్తారు
- బర్హిస్సు జాతి - ఈ దర్భలను యాగాలలో, వివిధ రకాల క్రతువులలో వినియోగిస్తారు
Also Read: ఈ రోజు ( అక్టోబరు 28) చంద్రగ్రహణం - ఈ రాశివారు చూడకూడదు!
దర్భల ఆవిర్భావం వెనుకున్న పురాణగాథలు
అసలు ఈ దర్భలు ఎలా ఆవిర్భవించాయో చెబుతూ రకరకాల పురాణ గాధలున్నాయి. కూర్మ పురాణం ప్రకారం...కూర్మావతారంలో క్షీరసాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, కూర్మం శరీరం మీద ఉండే వెంట్రుకలు.. సముద్రంలో పడిపోయి, ఒడ్డుకు కొట్టుకుని వచ్చి కుశముగా మారాయనీ, ఆ సమయంలో అమృతం చుక్కలు వాటిమీద పడడం వల్ల వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడిందనీ అంటారు. మరో కథ ప్రకారం ఇవి విశ్వామిత్రుడి సృష్టి అని కూడా ఉంది. అంతేకాదు ఈ దర్భలను ఎప్పుడుపడితే అప్పుడు కోయకూడదు . పుష్యమి నక్షత్రం, ఆదివారం రోజున వాటిని కోయడం చాలామంచిది.