Ksheerabdhi Dwadashi Vrat Katha: క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ!
కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరైతే తులసి పూజ చేస్తారో అంతులేని ఫలితం పొందుతారని ధర్మరాజుకి వివరించారు వ్యాసమహర్షి...
Ksheerabdhi Dwadashi Vrat Katha: పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలసి ద్వైతవనంలో ఉండగా..అక్కడకు రుషులతో కలసి వ్యాసమహర్షి వచ్చారు. రుషులందరకీ సకల మర్యాదలు చేసిన తర్వాత ధర్మరాజు..వ్యాసమహర్షిని ఉద్దేశించి...స్వామీ మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి.. ‘నాయనా! మంచి ప్రశ్న వేశావు..ఈ విషయం పూర్వమే నారదమహర్షి బ్రహ్మను అడగ్గా సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పారు. అందులో ఒకటి క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం...అందులో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతం గురించి నీకు చెబుతాను విను అన్నారు.
క్షీరాబ్ధి ద్వాదశి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వ్యాసుడు - ధర్మరాజు
కార్తిక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమం అయిన తర్వాత పాలసముద్రంలో యోగనిద్రనుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో, మునులతో, శ్రీ మహాలక్ష్మిదేవితో కలసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశాడు. ఏంటంటే..ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి రోజు సర్వమునులతో, దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేసినివారు సర్వపాపములు వీడి నా సాయుజ్యం పొందుతారన్నాడు. అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని చెప్పాడు వ్యాసమహర్షి.
ధర్మరాజు: అయ్యా ఈ వ్రతం చేయాల్సిన విధానం ఏంటో కూడా సూచించండి
వ్యాసుడు: కోరాడు. దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మళ్లీ స్నానమాచరించి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి తులసికోటను అందంగా అలంకరించి లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తికొలది తాంబూలం సమర్పించుకోవాలి.
Also Read: ఈ రాశివారి మాటలో మాధుర్యం మనసు చంచలం, నవంబరు 24 రాశిఫలాలు
వ్యాసమహర్షి చెప్పిన దీపదాన మహిమ
కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం సమీపమున దీపదానము చేయాలి. లేదంటే తులసి కోట దగ్గరైనా దీపదానం చేయొచ్చు. ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి. అంతకన్నా ఎక్కువ దీపదానం చేసినవారికి ఫలితం అనంతం.
- భక్తితో నొకవత్తితో దీపము పెట్టిన బుద్దిశాలి అగును
- నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును
- పదివేసిన విష్ణుసాయుజ్యం పొందును
- వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును
- ఆవునేయి మంచిది
- నువ్వుల నూనె మధ్యమం
- ఇతరములైన అడవినూనెలు కనీసం
- ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును
- నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును
- ఇప్పనూనె భోగప్రదము
- అడవినూనె కామ్యార్థప్రదము
- ఆవనూనె మిగుల కోరికలనిచ్చును
- అవిసెనూనె శత్రుక్షయకారి
- ఆముదము ఆయుష్షును నాశనము చేస్తుంది
- బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును తొలగించును
- వీటిలో కొంచెం ఆవునేయి కలిసిన దోషపరిహారమగును
ఈ దీపదానములవలననే ఇంద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. ద్వాదశి నాడు దీపదానము చేసిన, దీపాల వరుస ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.’
Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!
ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన తులసి మహత్యము
తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెబుతున్నాను విను. కార్తికమాసంలో తులసిపూజ చేయువారు ఉత్తమలోకమును పొందుదురు. ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. పూర్వం కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసితోటను చూశారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూచి హరిమేధుడు అదేంటని అడిగాడు. అప్పుడు సుమేధుడు తులసికథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వము దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు దానిలోంచి ఐరావతం, కల్పవృక్షం సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి..అమృతకలశం ఉద్భవించింది. ఇలా పుట్టిన తులసిని...శ్రీ మహాలక్ష్మితో పాటూ విష్ణువు వివాహం చేసుకున్నాడు. అందువలన నారాయణునకు తులసిపై ఎక్కువ ప్రీతి. అందుకే తులసికి నమస్కరించానని చెప్పాడు సుమేధుడు. ఈ కథ మొత్తం పూర్తైన వెంటనే వాళ్లు కూర్చున్న మర్రిచెట్టు మధ్యలోకి విరిగి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారం..అప్సరసలతో మైమరచి ఉన్న సమయంలో మాకు తెలియకుండానే రోమశమహామునికి తపోభంగం చేశాం... ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు తొర్రలో ఉన్నాం...ఇప్పుడు మీరు చెప్పిన తులసి కథ విని శాపవిమోచనం పొందామని..మీకు తీర్థయాత్రాఫలం సిద్ధించిందని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్లిపోయారు. అనంతరం బ్రాహ్మణులిద్దరూ నారాయణుడిని ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి ఉత్తమగతిని పొందుతారని బ్రహ్మదేవుడు.. నారదుడికి చెప్పిన కథని....వ్యాసుడు ధర్మరాజుకి వివరించాడు..
Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!