Khairatabad Ganesh 2024 : 70 ఏళ్లు..70 అడుగులు - ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతలివే!
Vinayaka Chvithi 2024: ఖైరతాబాద్ వినాయకుడు 2024లో సప్తముఖ మహాశక్తి గణపయ్యగా పూజలందుకోనున్నాడు. ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్లు అయిన సందర్భంగా 70 అడుగుల భారీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు...
Khairatabad Ganesh 2024
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి. విగ్రహాల తయారీ జోరందుకుంటోంది. ఊరూరా కొలువుతీరే మండపాలన్నీ ప్రత్యేకమే అయినా.. ఖైరతాబాద్ గణేష్ సందడే వేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహం ఈ ఏడాది 70 అడుగులు రూపుదిద్దుకోనుంది. నిర్జల్ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్రపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా వినాయకచవితికి వారం ముందు స్వామివారి విగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోనున్నాడు ఈ మేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ సహా నిపుణులంతా ఇప్పటికే పనుల్లో వేగం పెంచారు. ఈ ఏడాది పరిస్థితుల ప్రకారం ప్రపంచ శాంతితో పాటూ అందరికీ ఆయురారోగ్యాలు కలిగేందుకు సప్తముఖ గణపయ్యను పూజించాలని చెప్పారు దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ. ఆయన సూచనల మేరకు ఈ ఏడాది సప్తముఖాలతో వినాయకుడిని తయారు చేస్తున్నామని చెప్పింది ఉత్సవకమిటీ. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలు...పీఠం అన్నీ కలిపి 70 అడుగుల ఎత్తులో భారీ లంబోదరుడు కొలువుతీరనున్నాడు. గతంలో తయారైన సప్తముఖ గణపతికి భిన్నంగా ఈ సారి విగ్రహాన్ని తయారుచేస్తున్నట్టు శిల్పి చెప్పారు. ఈ నెల 17 న నమూనా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
Also Read: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!
1954లో ప్రారంభమైన ఉత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది.. 1954లో ఒక్క అడుగు వినాయకుడిని ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావడంతో ఏకండా 70 అడుగు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మట్టితో తయారుచేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్టిస్తామని ఉత్సవకమిటీ సభ్యులు పేర్కొన్నారు.
భాగ్యనగరం మొత్తం సందడే సందడి
వినాయక నవరాత్రులు అంటే ఖైరతాబాద్ ప్రత్యేకం అయినప్పటికీ భాగ్యనగరంలో బాలాపూర్, చార్మినార్ ,బడి చౌడీ వంటి ప్రాంతాల్లోనూ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. పదకొండు రోజుల పాటూ పూజలందించడం ఒకెత్తైతే.. నిమజ్జన వైభవం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. నవరాత్రులు పూర్తైన తర్వాత పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు.
Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!
గణేశ ద్వాదశనామ స్తోత్రమ్
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||
అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||
గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||
విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ||
|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||
Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!