Gold: దేవుళ్ల ఫొటోల్లో ఒళ్లంతా బంగారమే! వాళ్లకు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయ్? మనకు ఎప్పటి నుంచి అలవాటైంది?
Gold Jewellery: సినిమాల్లో చూసినా, ఇంట్లో పూజా మందిరంలో ఉండే దేవుడి ఫొటోల్లో చూసినా స్వామి, అమ్మవార్ల ఒళ్లంతా బంగారమే. వాళ్లకు ఆ ఆభరణాలు ఎవరు చేసిచ్చారు? మనుషులు ఎప్పటి నుంచి బంగారం ధరిస్తున్నారు?

దేవతల ఫొటోల్లో బంగారు ఆభరణాలు తళతళలాడిపోతుంటాయ్
విగ్రహాల్లోనూ బంగారు ఆభరణాలు అలంకారంగా కనిపిస్తాయ్
నగలు, కిరీటాలు, కొన్ని ఆయుధాలు అన్నీ బంగారుమయమే..
ఇవన్నీ దేవతలకు ఎలా వచ్చాయ్? ఎవరు చేసిచ్చారు?
నిజంగా ఫొటోల్లో మనకు కనిపించినట్టే దేవతలు బంగారం వేసుకునేవారా?
ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు? వాస్తవం ఏంటి? మనం గ్రహించాల్సిందేంటి?
బంగారం అనేది ప్రకృతిలో అత్యంత నిర్మలమైన, వినాశనం లేని లోహం. తుప్పు పట్టదు, మారదు, కాలం చేయదు. వెలుగు పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే బంగారాన్ని ఆత్మ, అమరత్వానికి ప్రతీకగా చెబుతారు.
దేవతలకు బంగారం ఎవరిచ్చారు?
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దేవతలు బంగారం ధరించలేదు..వారి స్వభావమే బంగారం. దేవతలు సూక్ష్మ దేహాలు. వారి శరీరం తేజస్సుతో నిండి ఉంటుంది. వారి చుట్టూ ప్రకాశం ఉంటుంది. దాన్ని చూడలేకపోవడం వల్ల దేవతలు బంగారు ఆభరణాలు ధరించి వెలిగిపోతున్నట్టు వర్ణించారు. కాని ఇది ప్రతీకాత్మకం. వారి తేజస్సుని సూచిస్తూ ఫొటోల్లో , విగ్రహాల్లో బంగారం ఉంటుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఇందులో భాగంగానే భక్తులు, రాజులు, సామంతులు..ఆలయాలకు బంగారు ఆభరణాలు సమర్పించడం ఓ భక్తి ప్రకటన మాత్రమే. ఇది వేదకాలం నుంచి ఉంది. దేవుడికి ఇచ్చేది మన సంపదలో ఉత్తమమైనది కావాలన్నదే బంగారం సమర్పించడం వెనుకున్న ఆంతర్యం.
మనుషులకు బంగారం ఎప్పటి నుంచి అలవాటైంది?
చరిత్ర ప్రకారం భారతదేశంలో బంగారం వాడకం సింధు నాగరికత (2500–1900 BCE) నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. హరప్పా, లోథల్ వంటి చోట్ల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వేదకాలం నుంచి బంగారాన్ని హిరణ్యం అని పిలుస్తూ దానాల్లో ఉపయోగించేవారు. రామాయణ, మహాభారత కాలంలో బంగారు నగలు, కిరీటాలు, బంగారు రథాలు సాధారణం.
ఆత్మకు ప్రతిబింబం బంగారం
బంగారాన్ని ఆత్మకు ప్రతిబింబం అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. అంతర్గత తేజస్సు మనవైపు తిరిగిరావాలనే ఆలోచనతో బంగారం వైపు మనుషులు ఆకర్షితులవుతారట. కానీ చాలామంది బాహ్య బంగారంలోనే ఆగిపోతారు. అందుకే ఉపనిషత్తులు ఏం చెబుతాయంటే.. హిరణ్య గర్భ అంటే బంగారం లాంటి గర్భం కలిగినవాడు అంటూ బ్రహ్మను వర్ణిస్తాయి. దీని సారాంశం ఏంటంటే దేవతల బంగారం శుద్ధమైన చైతన్యం, బాహ్య ప్రతిరూపం మాత్రమే. భక్తులు బంగారం సమర్పిస్తున్నారంటే..దాని అర్థం.. తమ సంపద, ఆసక్తి, అహంకారాన్ని భగవంతుడి వద్ద విడిచిపెడుతున్నాం అని. నిజమైన బంగారం అంతర్గతంలోనే ఉంది.
"హిరణ్యం న భూషణం, హిరణ్యం హి భూషణం"
దీని అర్థం ఏంటంటే బంగారం నిజమైన ఆభరణాలు కాదు .. బంగారం లాంటి హృదయం కలిగి ఉండడమే నిజమైన ఆభరణం. హిరణ్యం న భూషణం సౌందర్యం కోసం ధరించే బంగారు గొలుసులు, ఉంగరాలు మనిషికి శాశ్వతమైన అందాన్ని, ఆనందాన్ని ఇవ్వవు. బంగారు ఆభరణాలు
"హిరణ్యం న భూషణం, హిరణ్యం హి భూషణం" — బంగారం అలంకారం కాదు, బంగారమే (ఆత్మే) అలంకారం అని భావం.బంగారు ఆభరణాలు ధరించిన దేవుని చూసి, మనం కూడా మన అంతర్గత తేజస్సును (ఆత్మను) అలంకరించుకోవాలని గుర్తు చేస్తుంది. ఇదే నిజమైన భక్తి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















