Varanasi: కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?
Varanasi Special: వారణాసిలో 9 రోజులు ఉండటం.. అత్యంత పవిత్రమైనదిగా, మోక్షాన్ని ప్రసాదించేదిగా చెబుతారు. ఇంతకీ కాశీలో నవరాత్రులు ఉండాలని ఎందుకంటారు? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి?

9 Days in Kashi : ప్రతి భక్తుడు ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. జీవిత చరమాంకం ఇక్కడే గడిపేయాలని భావిస్తారు. ఈ క్షేత్రంలో ప్రాణంపోతే శివుడి సన్నిధికి చేరుకుంటామని విశ్వసిస్తారు. అయితే వీటితో పాటూ కాశీ నగరంలో నవరాత్రులు ఉండడం మోక్షానికి చేరువ చేస్తుందనే విశ్వాసం.
కాశీలో 9 రాత్రులు ఉండాలని చెప్పడం వెనుకున్న ఆంతర్యం?
ప్రతి మనిషి తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఆ తర్వాత మనిషిగా భూమ్మీద అడుగుపెడతాడు. అలా జన్మరాహిత్యం ఇచ్చేది వారణాసి ఒక్కటే. అందుకే వ్యాసమహర్షి కాశీలో 9 నెలలు దీక్షలో ఉండి తర్వాత స్వగ్రామం చేరుకుని పూజ చేయాలని చెప్పారు. అయితే కలికాలంలో అన్ని రోజులు దీక్ష సాధ్యం కాదని ఇంకేదైనా ఉపాయం చెప్పమని కోరిన సామాన్యులకు.. 9 నెలల బదులుగా 9 రాత్రులు వారణాసిలో ఉండాలని సూచించారు.
9 రోజులు ఏం చేయాలి
కాశీ విశ్వనాథుడి నామ స్మరణ, దానాలు, ధర్మ ప్రసంగాలు వినడం, ఏక భుక్తం, ప్రాతఃకాల స్నానం, ఉదయం రాత్రి విశ్వేశ్వరుడి దర్శనం, కోపాన్ని విడిచిపెట్టడం, అబద్ధం చెప్పకుండా ఉండడం.. ఈ నియమాలు పాటించాలి
వారణాసిలో మొదటి రోజు
కాశీ విశ్వేశ్వరా శరణు..అనుజ్ఞ ఇవ్వు అని స్మరించుకుంటూ మణి కర్ణికా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి. కేశఖండనం చేసుకుని మళ్లీ స్నానమాచరించాలి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. మణికర్ణిక ఘాట్ వద్ద స్నానాది కార్యక్రమాలు పూర్తిచేసుకున్న తర్వాత డుండి వినాయకుడిని దర్శించుకుని గరికలు సమర్పించాలి. 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణగా సమర్పించాలి. అనంతరం విశాలాక్షి, జ్ఞానపాపి, సాక్షి గణపతిని దర్శించుకోవాలి. ఒకపూట భోజనం చేసి రాత్రివేళ పండ్లు పాలు స్వీకరించాలి. విశ్వనాథుడిని స్మరిస్తూ నిద్రపోవాలి
వారణాసిలో రెండో రోజు
కాశీలో రెండో రోజు ఉదయాన్నే గంగాస్నానం ఆచరించి విశ్వేశ్వర, అన్నపూర్ణను దర్శించుకోవాలి. మధ్యాహ్నం మణికర్ణికా ఘాట్ లో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. వెయ్యిసార్లు గాయత్రి మంత్రం జపించాలి. గురు ఉపదేశంతో శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమ: అని వెయ్యిసార్లు జపించాలి. అనంతరం మరోసారి విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలి
వారణాసిలో మూడోరోజు
వేకువజామునే అసీ ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం ఆచరించి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ లో స్నానం చేసి వరుణా ఘాట్ కి వెళ్లి ఆదికేశవ స్వామిని దర్శించాలి . పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం అచరించాలి. మణి కర్నేశుని , సిద్ధి వినాయకుని, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం పూర్తిచేసుకోవాలి.
వారణాసిలో నాలుగో రోజు
ఉదయాన్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని, డుండి వినాయకుడిని దర్శించుకోవాలి. కాలభైరవుడిని పూజించాలి
వారణాసిలో ఐదో రోజు
ఈ రోజు పంచక్రోస యాత్ర ప్రారంభిస్తారు. ఈ ఐదు రోజులు కాళ్లకు చెప్పులు ధరించకూడదు. ఏకభుక్తం తప్పనిసరి. ఐదో రోజు తెల్లవారుజామున మణికర్ణిక ఘాట్ లో స్నానం చేసి పంచక్రోశ యాత్ర మొదలుపెడతారు. మొత్తం 80 కిలోమీటర్ల యాత్రను ఐదు రోజుల్లో పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరించనివారు ఆటోలో యాత్ర పూర్తిచేస్తారు. మొదటి రోజు కర్ధమేశ్వరం నుంచి భీమచండీ వరకు యాత్ర చేస్తారు. దారిలో శివలింగాలు, ఆలయాలు దర్శించుకుని రాత్రికి భీమచండి దగ్గర బస చేస్తారు. నేలపైనే నిద్రించాలి
వారణాసిలో ఆరో రోజు
ఈ రోజు పంచక్రోశ యాత్ర కొనసాగుతుంది. దారిలో దేహళీ వినాయకుడిని దర్శించుకుంటారు..ఇక్కడే కాశీ సరిహద్దు మొదలవుతుంది. రామేశ్వర లింగం దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజంతా మౌనంగా ఉండాలి.
వారణాసిలో ఏడో రోజు
పంచక్రోస యాత్రలో మూడోరోజు యాత్ర కొనసాగుతుంది. రామేశ్వరం నుంచి శివపురి వరకూ నడకసాగుతుంది. మధ్యలో కపిలధార తీర్థంలో స్నానం ఆచరిస్తారు. శివపురిలో రాత్రికి బసచేసి వటవృక్షం కింద కూర్చుని శివుడి ధ్యానం చేస్తారు. ఈ రోజు అన్నదానం చేస్తే విశేష ఫలితం
వారణాసిలో ఎనిమిదో రోజు
శివపురి నుంచి కపిలేశ్వరం మీదుగా మణికర్ణిక చేరుకుంటారు. దీంతో పంచక్రోశ యాత్ర పూర్తి అవుతుంది. ఆదికేశవ స్వామి వద్ద యాత్ర సమాప్తి చెప్పాలి. సాయంత్రం గయను సందర్శించాలి. లోలార్క కుండలో స్నానం ఆచరిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్మకం. చర్మరోగాలుంటే తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. రాత్రికి త్రిలోచనేశ్వరుడు, కేదారేశ్వరుడిని దర్శించుకోవాలి.
వారణాసిలో తొమ్మిదో రోజు
ఈ రోజుతో అతి ముఖ్యమైన 9 నెలల గర్భవాసం పూర్తి చేసుకున్నట్టే. ఈ రోజు మణికర్ణిక ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. కాలభైరవుడికి వీడ్కోలు చెప్పి..యాత్ర పూర్తైంది స్వామీ, అనుజ్ఞ ఇవ్వు అని ప్రార్థించి కాలభైరవుడికి నల్లటి వస్త్రం సమర్పించాలి. కాలభైరవుడికి అనుమతి లేనిదే కాశీలో అడుగుపెట్టలేరు..అలాగే..కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీ విడిచి వెళ్లకూడదు.
- విశ్వనాథుడి ఉద్యాపన పూజలో భాగంగా 9 రోజుల దీక్షకు గుర్తుగా స్వామికి అభిషేకం, బిల్వార్చన చేయాలి
- అన్నపూర్ణమ్మ వద్ద భిక్ష..."భిక్షాందేహి కృపావలంబనకరీ" అని అడిగి అక్షయపాత్రలో బియ్యం తీసుకోవాలి..ఈ బియ్యం ఇంటికి తెచ్చుకుంటే ధనధాన్యాలకు లోటుండదు
- వృద్ధ బ్రాహ్మణ దంపతులు 9 మందికి భోజనం పెట్టి వస్త్రాలు, దక్షిణ ఇవ్వాలి.
- అనంతరం విశాలాక్షి..బిందుమాధవుడిని దర్శించి వీడ్కోలు చెప్పాలి
కొందరు తొమ్మిదో రోజు బయలుదేరుతారు..మరికొందరు తొమ్మిది రాత్రులు పూర్తయ్యాక పదో రోజు తిరుగు ప్రయాణం అవుతారు. కాలభైరవుడి అనుమతి తీసుకోవడం ముఖ్యం.
కాశ్యాం మరణాన్ ముక్తిః
వారణాసిలో మరణిస్తే మోక్షం...కానీ 9 రోజులు నియమంగా ఉంటే జీవించి ఉండగానే మోక్షాన్ని చూసినట్టే అని శాస్త్రం చెబుతోంది
ఇంటికి చేరుకున్న తర్వాత మంచిరోజు చూసి కాశీ నుంచి తీసుకొచ్చిన గంగ, విభూది, బియ్యం పెట్టి పూజచేయాలి. అప్పటితో కాశీ యాత్ర సంపూర్ణం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Before You Go
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























