Durgashtami 2024: దుర్గాష్టమి విశిష్టత - దేవీ త్రిరాత్ర వ్రతంలో ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి!
Devi Triratra Vratam: దేవీ త్రిరాత్ర వ్రతం జరుపుకునే మూడు రోజుల్లో మొదటిది దుర్గాష్టమి. శరన్నవరాత్రుల్లో మొదటి ఏడు రోజులు లెక్క వేరు ఆ తర్వాత మూడు రోజులు వేరు. ఈ ఏడాది అక్టోబరు 10 దుర్గాష్టమి..
Significance of Durgastami : ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో నచ్చే శరన్నవారత్రుల్లో చివరి మూడు రోజులను దేవీ త్రిరాత్ర వ్రతం అని పిలుస్తారు. అందులో మొదటి రోజు దుర్గాష్టమి. ఈరోజు విద్యార్ధులైతే పుస్తకాలకు, శ్రామికులైతే పనిముట్లకు, క్షత్రియులు ఆయుధాలకు పూజచేసి అమ్మవారి అనుగ్రహానికి పాతృలవుతారు. ఈ తొమ్మిదిరోజులు ప్రత్యేక పూజలు చేయలేనివారు చివరి మూడు రోజులు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతమే దేవీ త్రిరాత్ర వ్రతం అంటారు
పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి విరాటుడి కొలువుకి వెళ్లేముందు.. తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరిచారు. అజ్ఞాతవాసం పూర్తైన తర్వాత ఉత్తర గో గ్రహణ యుద్ధానికి వెళుతూ వెళుతూ మార్గ మధ్యలో జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి.. ఆ వృక్షానికి నమస్కరించి ఆయుధాలను తిరిగి పొందారు. శమీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలు స్వీకరించిన తర్వాత చేసిన యుద్ధంలో విజయం సాధించడంతో ఆ వృక్షానికి విజయాన్నిచ్చేదిగా , పవిత్రమైనదిగా మారింది. ఇప్పటికీ జమ్మిచెట్టుకి పూజలు చేయడం వెనుకున్న ఆంతర్యం ఇదే.
Also Read: శ్రీ కృష్ణదేవరాయల కాలంలో దసరా ఎలా జరిగేది - ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారు!
కాళీ అమ్మవారి నుదిటి భాగం నుంచి దుర్గ ఉద్భవించిందని కొందరు చెబుతారు. అందుకే కనకదుర్గను కాళీ, చండీ, రక్తబీజగా కొలుస్తారు. ముఖ్యంగా దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను పూజిస్తారు. 8 శక్తి రూపాలుగా చెప్పే బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండిని కొలుస్తారు. నవరాత్రుల నియమాలు అత్యంత కఠినంగా అనుసరిస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో ఉండేవారు తమ సామగ్రిని, ఆయుధాలను అమ్మవారి దగ్గరుంచి పూజిస్తారు. "లోహుడు" అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందని..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు.
దుర్గ అంటే దుర్గమైనది దుర్గ
దుర్గతులను తొలిగించేది దుర్గ
దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గ
లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అనే నామం ఉంటుంది..
దుర్గ అనే నామం ...గత జన్మ వాసనలను పూర్తిగా తుడిచేసి దుర్గుణాలను సద్గుణాలుగా మారుస్తుందని..సంతోషాన్నిస్తుందని చెబుతారు
దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షస బాధలుండవు.
మొదటి 3 రోజులు దుర్గా రూపం - అరిషడ్వర్గాలను జయించేందుకు
4,5,6 రోజులు లక్ష్మీ రూపం - ఐశ్వర్యం కోసం
చివరి మూడు రోజులు సరస్వతీ రూపం - జ్ఞాన సముపార్జన కోసం
Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!
శరన్నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఎంతో విశిష్టమైన దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి 9 రోజుల్లో ఈ 13 అధ్యాయాలను పారాయణం చేయాలి. మొదటి రోజుల్లో కుదరకపోయినా దుర్గాష్టమి రోజు నుంచి మూడు రోజులు పారాయణం చేసినా మంచి ఫలితం పొందుతారు.
నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!