Navratri 2024: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!
Devi Triratra Vratam : దేవీ త్రిరాత్ర వ్రతం..అంటే శరన్నవరాత్రుల్లో మూడు రోజులు చేసే వ్రతం. అవే దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి..ఈ మూడు రోజులు ఎందుకంత విశిష్టమైనవి...
Dussehra 2024 : ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులను దేవీ త్రిరాత్ర వ్రతం అంటారు..అవే దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకాలకు, శ్రామికులు పనిముట్లకు, క్షత్రియులు ఆయుధాలకు పూజచేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఈ 3 రోజులు ఎందుకంత ప్రత్యేకం..త్రిరాత్ర వ్రతం అంటే ఏంచేయాలి..
'దుర్' అంటే దుఃఖం , దుర్వ్యసనం , దారిద్ర్యం
'గ' అంటే నశింపచేసేది
దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ బాధల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అందుకే నవరాత్రుల్లో మూడు మూడు రోజులను ఒక్కో ప్రత్యేకంగా భావిస్తారు..
మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను జయిస్తారు..
రెండో మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందుతారు
చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , విజయాన్ని పొందుతారు..
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు
దుర్గాష్టమి - అక్టోబర్ 10 ( Durga Ashtami )
దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందట..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారని పండితులు చెబుతారు. దుర్గ అంటే దుర్గమైనది ,దుర్గతులను తొలగించేది అని అర్థం.
మహర్నవమి - అక్టోబరు 11 (Maha Navami 2024)
జీవకోటిని పునీతులను చేసేందుకు భగీరదుడు గంగమ్మను దివి నుంచి భువికి తీసుకొచ్చిన రోజు ఇదే. అందుకే ఈ రోజు నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు కార్మికులు, వాహన యజమానులు, కులవృత్తుల వారు ఆయుధ పూజ చేస్తారు.
Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!
విజయదశమి - అక్టోబరు 12 ( Vijayadashami )
శ్రవణం నక్షత్రంలో కలసిన ఆశ్వయుజమాస దశమిని విజయా అనే సంకేతం ఉంది. అందుకే విజయ దశమి అని పిలుస్తారు. సాధారణంగా ఏ పని ప్రారంభించాలన్నా.. తిథి, వారం, నక్షత్రం, ముహూర్తం చూసుకుంటారు. కానీ విజయదశమి రోజు ఎలాంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజంతా మంచి రోజే..శుభఘడియలే. విజయ దశమిరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా అపజయం అనేదే ఉండదని చెబుతారు.
దశమి రోజు సాయంత్రం చేసే శమీపూజ అత్యంత విశిష్టమైనది. శమీవృక్షం అంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి ఆయుధాలను దాచిఉంచిన వృక్షం ఇది. వాటిని తిరిగి తీసుకునే సమయంలో జమ్మిచెట్టుకి నమస్కరించి ఆయుధాలను తీసుకెళ్లి కురుక్షేత్రంలో పాల్గొని విజయం సాధించారు. శమీవృక్షం రూపంలో అపరాజిత దేవిని పూజించి..అపరాజిత స్త్రోత్రం చదువుకోవాలి.
శ్రీరామచంద్రుడు కూడా రావణ సంహారానికి ముందు అపరాజిత దేవిని పూజించాడు..
విజయదశమి రోజు సాయంత్రం శమీ వృక్షానికి నమస్కరించి..అపరాజిత దేవిని పూజిస్తారు.
శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇది
శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
ఈ శ్లోకాన్ని ఓ చిన్న పేపర్ పై రాసి..దానిని శమీ వృక్షానికి తగిలిస్తారు. ఇలా చేస్తే అపరాజిత దేవి కరుణ లభిస్తుంది, శనిదోషం తొలగిపోతుందని నమ్మకం.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!