Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Telangana News: నిమిషం నిబంధన కొందరు గ్రూప్ 2 అభ్యర్థులకు పరీక్షను దూరం చేసింది. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడంతో వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో వారు ఆవేదనకు గురయ్యారు.
Group 2 Candidates Miss Their Exam Due To One Minute Rule: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి రోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. అయితే, నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. తామేం చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. అటు, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ గర్ల్స్ హాస్టల్‌లో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిని నిమిషం ఆలస్యం కావడంతో సిబ్బంది అనుమతించలేదు. దీంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. అలాగే, మంచిర్యాల జిల్లాలో శ్రీహర్ష డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు ముగ్గురు అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు.
అరగంట ముందే ఆలస్యమైనా..
మరోవైపు, జనగామ జిల్లాలో ఓ మహిళ అరగంట ముందే పరీక్షకు హాజరైనా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ షీట్ బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించిన అధికారులు.. పరీక్ష కేంద్రంలోకి అనుమతించినప్పుడు సెంటర్ కోడ్ ఇది కాదని చెప్పడంతో ఆమె అసలు కేంద్రానికి పరుగున వెళ్లారు. అయితే, అప్పటికే టైం దాటిపోవడంతో వారు అక్కడ అనుమతించలేదు. దీంతో ఆమె చేసేదేమీ లేక కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణలో ఆదివారం గ్రూప్ 2 పరీక్షలు (Group 2 Exams) ప్రారంభం కాగా.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 783 గ్రూప్ - 2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఆది, సోమవారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ 2022, డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. అటు, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.