Tirupati Laddu : శ్రీవారి లడ్డూకు 307 ఏళ్ల చరిత్ర - మొదట్లో ఎలా ఉండేదంటే ?
Srivari Laddu: శ్రీవారి ప్రసాదం లడ్డూ గురించి పూర్తి వివరాలు మీకు తెలుసా ?
Srivari Laddo : ఎవరైనా తిరుపతి వెళ్లాం అంటే... ముందుగా ప్రసాదం ఏది అనే ప్రశ్న దూసుకొస్తుంది. ప్రసాదం అంటే లడ్డూ. శ్రీ వేంకటేశ్వరుడు ఎంత గానో ఇష్ట పడే లడ్డూ ప్రసాదం భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు.. ఇంతకీ శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎప్పుడూ తయారు అయ్యింది..? ఎప్పటి నుండి ప్రాచుర్యం పొందింది ? ఇవన్నీ చాలా మందికి తెలియని విషయాలు. తెలుసుకోవాలనుకునే విషయాలు కూడా.
శ్రీవారికి అనేక ప్రసాదాలు !
స్వామి వారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది.. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహారా, వడ పప్పు, మురగాన్నం ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది.. శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చరిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి.. ఈ సమయంలో మంత్రిగా పని చేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్టు ప్రచారంలో ఉంది. రెండవ దేవరాయల కాలంలోనే స్వామి వారికి నివేదించాల్సిన ప్రసాదాలు వాటిని స్వామి వారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
మొదట్లో బూందీ 1942 నుంచి లడ్డూ ప్రసాదం !
శ్రీవారి ఆలయంలో స్వామి వారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తున్నలప్పటికీ స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ.. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామి వారికి నివేదిస్తున్నటు ఆధారాలున్నాయి. 1455లో సుఖీయం, అప్పంను, 1460లో వడను, 1468లో అత్తిరసంను, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశ పెట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది.. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు . ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 12వ శతాభ్ధం నాటి మానసోల్లాస గ్ర౦థ౦లో తిరుమల లడ్డూ ప్రస్తావన ఉ౦ది.. తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారని, మొదట్లో బూందీగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారని తెలుస్తోంది.
ఎన్నెన్నో మార్పుల తర్వాత లడ్డూ !
శ్రీవారి భక్తులు ఎంతో ప్రీతి పాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం దాదాపు 307 సంవత్సరాల క్రిందటే మొదలైందని తెలుస్తోంది.. 1715, ఆగస్టు 2వ తేదీన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటుతరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు తెలుస్తోంది.. మొదట్లో లడ్డూ ప్రసాదంను ఎనిమిది నాణేలకే ఇచ్చేవారని, అటుతరువాత 2,5,10,15,25 నుండి ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది.. 1940 వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 82 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు కొందరు..
శ్రీవారి లడ్డూకు ప్రత్యేక పేటెంట్ !
తిరుమల తిరుపతి దేవస్థానంలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది.. ఈ లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టిటిడి కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతూ వస్తోంది.. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంగా లడ్డూగా ఇవ్వడం 1715 ఆగస్టు 2వ తారీఖున మెదలు పెట్టారని తెలుస్తోంది.. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేక పోతున్నారు.. 2010 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టిటిడి తయారు చేసేది.. ఇక ప్రత్యేక పర్వదినాల్లో భక్తులకు అవసరం అయ్యే అధిక లడ్డూలను టిటిడి తయారు చేసి అందుబాటులో ఉంచేది.. ప్రతి నిత్యం లడ్డూ తయారీకి వందల మంది పోటులో కార్మికులు శ్రమించేవారు.. భక్తుల రద్దీ క్రమేపి పెరుగుతూ ఉండడంతో అందుకు అనుగుణంగా పోటును అత్యాధునిక వసతులు కల్పిస్తూ తయారీ సంఖ్యను టిటిడి పెంచుతూ వస్తోంది.. లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి 2014లో రిజిస్ట్రేషన్ అవుతూ, జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లభించింది.