Bathukamma Significance In Telugu: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!
Bathukamma Significance In Telugu: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ఏంటంటే..
Bathukamma Significance In Telugu: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది. తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంతకీ బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది..ఈ పండుగ వెనుక ప్రచారంలో ఉన్న పురాణ, జానపథ కథలేంటో తెలుసుకుందాం.
'బతుకమ్మ'పండుగ వెనుక పురాణ గాథ
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేయడంతో అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
జానపద గాథ
ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి. ఆమె అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకాలమైనా తిరిగిరావకపోవడంతో వదినల వేదింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె అన్నయ్యలు తిరిగొచ్చి జరిగింది తెలుసుకుని నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపూవొకటి వీళ్లవైపు తేలుతూ వచ్చిందట. తమ చెల్లెలు ఆ తామర రూపంలో వచ్చందని భావించారు అన్నలు. ఆ రాజ్యాన్నేలే రాజు ఆ అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పూవుని తీసుకెళ్లి తన తోటలో కొలనులో వేయగా చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మెలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకుతెరువు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించడం మొదలు పెట్టారట.
ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు, మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి...మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెబుతారు. ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని ఇలా ఏడుగురు పుట్టి చనిపోయారని 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం.
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలను వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. ఆ తర్వాత బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేస్తారు.