Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
బెజవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది. తొమ్మిది రోజుల పాటూ అమ్మవారు 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ అలంకారాలు-వాటి వెనుకున్న విశిష్టత ఏంటి...
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు శరన్నవరాత్రులు
దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం . ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిచ్చే అలంకారాలు-వాటి వెనుకున్న విశిష్టత గురించి తెలుసుకుందాం...
శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవి
ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగి శుభాలు కలుగుతాయి
శ్రీ బాలా త్రిపురసుందరి దేవి
మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు.శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం
Also Read: మోక్షం కావాలా నాయనా - ఇంతకీ మోక్షం అంటే ఏంటి, ఎలా వస్తుంది!
శ్రీ గాయత్రీ దేవి
సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి
సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుకుగడను చేతపట్టుకుని కూర్చున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది.
Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
శ్రీ సరస్వతీ దేవి అలంకారం
సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ మరింత పుణ్యదినాలుగా భావిస్తారు భక్తులు.
శ్రీ దుర్గాదేవి
లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
శ్రీ మహిషాసురమర్దిని
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజాలు,అష్ట ఆయుధాలు, సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ రాజరాజేశ్వరి దేవి
వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.