Spirituality: మోక్షం కావాలా నాయనా - ఇంతకీ మోక్షం అంటే ఏంటి, ఎలా వస్తుంది!
Spirituality: మోక్షం అనే పదం దాదాపు అందరూ వినేఉంటారు. ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలిగిందని అనుకుంటారు. ఇంతకీ మోక్షం అంటే ఏంటి..అదెలా లభిస్తుందో తెలియజేసే పురాణ గాథ ఇది...
మోక్షం ఎవరికి తొందరగా లభిస్తుంది!
త్రిలోకసంచారి అయిన నారదుడు ఓసారి భూమ్మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు వెళ్లాడు. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు...వారిలో మొదటి వ్యక్తి ఓ ముని..
నారదుడు-ముని
నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునిదగ్గరకు వెళ్లాడు. నారదుడిని చూసిన ముని...‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు. స్పందించిన నారదుడు శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటానని బదులిచ్చారు నారదులవారు.‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు.సరేనని ముందుకు సాగిన నారదుడు ఆ తర్వాత చెప్పులుకుట్టే వ్యక్తికి కనిపించాడు.
నారదుడు-చెప్పులు కుట్టేవాడు
‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు,వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు. ‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అన్నాడు. సరేనన్న నారదుడు వైకుంఠానికి తిరుగుపయనమయ్యారు.
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది
శ్రీమహావిష్ణువు-నారదుడు
వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్లిన నారుదులవారు..తాను భూలోకంలో కలసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు ముందుంచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారనంటే ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు. ఆశ్చర్యపోయిన నారదుల వారు .. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ జీవనం గడుపుతున్న చెప్పులుకుట్టే వ్యక్తికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటనే సంశయంలో ఉండిపోయారు. ఇది గమనించిన శ్రీహరి..ఈ సారి నువ్వు వారిద్దరినీ కలసినప్పుడు ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పు..వారిలో ఎవరు గొప్ప భక్తులో తెలుస్తుందంటారు.
Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు
భూలోకానికి తిరిగి బయుదేరి వెళ్లిన నారదుడు మళ్లీ ఆ ఇద్దర్నీ కలుస్తారు. ఎప్పటిలానే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే..శ్రీహరి చెప్పమన్న సమాధానమే చెబుతారు నారదులవారు. అప్పుడు ఎవరి స్పందన ఎలా ఉందంటే...
ముని:‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.
చెప్పులుకుట్టేవ్యక్తి : ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు.
నారదుడు: స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!
చెప్పులుకుట్టేవ్యక్తి: ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేల గింజలున్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా’
పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం చెప్పులుకుట్టే వ్యక్తికే ఎందుకు ముందుగా వస్తుందో నారదుడికి అర్థమైంది...
ఇక్కడ మోక్షం అంటే..భగవంతుడు-భక్తుడు అని కాదు..మీరు నమ్మిన సిద్ధాంతం కావొచ్చు, మీరు చేస్తున్న పని కావొచ్చు. దానిపై పూర్తిస్థాయిలో విశ్వాసం ఉంటే వారు అందులో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు (మోక్షం పొందుతారు) అని అర్థం.