Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
వాస్తు పట్టింపులేకపోతే సరేకానీ..వాస్తుని పట్టించుకునేవారు ప్రతి చిన్న విషయాన్ని ప్రత్యేకంగా సరిచూసుకుంటారు. ఈ కోవకే చెందుతుంది గోడకు వేసే రంగులు. వాస్తు ప్రకారం ఇంటి గోడలకు ఏ రంగు వేయాలో తెలుసుకోండి
Vastu Tips: వాస్తు కొందరికి సెంటిమెంట్ మరికొందరికి ట్రాష్. అస్సలు పట్టించుకోనివారికి సమస్యే లేదు కానీ వాస్తుని విశ్వశించేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. ఇంటి నిర్మాణం సమయంలో మొదలైన వాస్తు..ఇంట్లో వస్తువులు సర్దుకునే వరకూ ఉంటుంది..చివరికి గోడకు వేసే రంగులు కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రంగులు ప్రశాంతతని ఇస్తే, మరికొన్ని రంగులు గందరగోళంగా అనిపిస్తాయి. రంగుల ఎంపికలో ఎవరి అభిప్రాయం వాళ్లది. అయితే మన ఇష్టాయిష్టాల సంగతి పక్కనపెడితే వాస్తు ప్రకారం ఇంట్లో వినియోగించాల్సిన రంగులు కొన్ని ఉన్నాయి. ఆ రంగులు ఇంటి గోడలకు వేస్తే ఆరోగ్యం, కెరీర్ బావుంటుంది..ఇంట్లో ప్రశాంతత ఉంటుందని చెబుతారు వాస్తు పండితులు.
Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!
ఏవైపు గోడకు ఏ రంగు
- ఇంటికి ఆగ్నేయ దిశ(అగ్నికి సంబంధించిన దిశ)లో నారింజ, గులాబీ, పసుపు రంగులు వేయడం శుభప్రదం. ఎందుకంటే ఇంటికి ఈ దిశ అగ్నికి సంబంధించినది.
- ఇంటి ఉత్తర భాగం నీటికి సంబంధించినది. ఆ దిశగా గోడలపై ఆకుపచ్చ, పిస్తా రంగులు వేయడం ద్వారా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు.మీరు స్కై బ్లూ కలర్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ ఏదైనా ముదురు రంగును ఉపయోగించకపోవడమే మంచిది
- ఇంటి పైకప్పుపై తెలుపు రంగు వేయడమే ఉత్తమం అంటారు వాస్తుపండితులు.
- దేవుడిని పెట్టే గోడకు లేత పసుపు, తెలుపు, ఆకాశం, నారింజ లేదా లేత గులాబీ రంగులు వేయాలి
- పడమర వైపు గోడకు లేదా గదులకు నీలం రంగు సరైనదని చెబుతారు. ముదురు నీలం రంగుకు బదులుగా, కొద్దిగా తెలుపు మిక్స్ చేసి వేయడం మంచిది
- పడకగదిలో గులాబీ రంగు, ఆకాశం రంగు లాంటి కలర్స్ వేయాలి. ఎందుకంటే ఇవి మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాదు చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ని పరుస్తాయట.
- దక్షిణం వైపు ఆరెంజ్ కలర్, గులాబీ రంగు వినియోగించవచ్చు
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
ఏ రంగు ఎలాంటి ప్రభావం చూపుతుందంటే
- ఇంట్లో అన్ని గదుల పైకప్పులకూ తెలుపు రంగే ఉండేలా చూసుకోవాలి. కారణం తెలుపు పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. గదిలోని ఉష్ణోగ్రతనూ తగ్గిస్తుంది.
- ఆరెంజ్,గులాబీ రంగులు శక్తికి సూచన. వంటగది, డైనింగ్ హాల్ గోడలకు వేసుకోవచ్చు.
- నీలిరంగు ప్రశాంతతకు ప్రతీక. ఇంట్లో పడకగది గోడలకు నీలిరంగు వేస్తే మనసు మహా ప్రశాంతంగా మారుతుంది. వాస్తు ప్రకారం పశ్చిమాన్ని చూసే ఏ గోడకైనా నీలిరంగు వేసుకోవచ్చు.
- పసుపు రంగు మనోల్లాసానికి, విజ్ఞతకు సూచిక. ఈ రంగు స్టడీ రూమ్, దేవుడి మందిరానికి వినియోగించడం మంచిది
- ఆకుపచ్చ రంగు హాలు, బెడ్‌రూమ్ గోడలకు ఎంచుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్న రూమ్ లో ఆకుపచ్చ రంగు వినియోగించడం మంచిది
Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.