Children's Day 2025: కృష్ణుడు, గణేశుడు నుంచి ధ్రువుడి వరకు.. పురాణ బాలలు vs స్మార్ట్‌ఫోన్ పిల్లలు! ఏం నేర్పుతున్నాం మనం?
Children's Day: నవంబర్ 14 బాలల దినోత్సవం. అసలు చిన్నారులు ఎలా ఉండాలి? ఈ తరం పిల్లలు ఎలా ఉంటున్నారు? తల్లిదండ్రులు ఏం నేర్పించాలి? ఏం నేర్పిస్తున్నారు?.. పురాణాల్లో బాలలు ఎలా ఉండేవారు?

Balala Dinotsavam: నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే సనాతన సంస్కృతిలో బాల్యం అంటే కేవలం ఆటలు, నవ్వులు మాత్రమే కాదు.. అది దైవత్వానికి సజీవ రూపం. పురాణాలు, ఇతిహాసాల్లో బాలలు ఎలా ఉండేవారు? బాలల దినోత్సవాన్ని ఆధ్యాత్మిక దృష్టిలో ఆలోచించారా ఎప్పుడైనా?
కృష్ణుడు
దివ్యమైన బాల్యానికి ప్రతిరూపం బాలకృష్ణుడు. గోకులంలో యశోద ముద్దుబిడ్డగా ఆడుతూ, అల్లరిచేస్తూ, మట్టితిని, పుట్టగొడుగులు పగలగొట్టి, ఆవుల వద్దకు పాలుతాగేందుకు లేగదూడలను వదిలేసి..ఇలా చేయని అల్లరి లేదు. చిన్నారి కిట్టయ్యని మందలిస్తూ మట్టితిన్నావా నోరు చూపించు అని అడిగిన యశోధ ఆ నోట్లో బ్రహ్మాండాన్ని చూసి నివ్వెరపోయింది. పిల్లల అమాయకత్వంలోనే బ్రహ్మాండం దాగి ఉందనే సందేశమే కదా ఇది. అంటే బాల్యంలో ఆకలి, ఆశ్చర్యం, అల్లరి ఇవన్నీ జ్ఞానానికి మూలమే అని శ్రీకృష్ణ లీలలు మనకు బోధిస్తాయి. పిల్లల్ని బడికిపంపించి మార్కులు తెచ్చుకోమని కాదు..వారిలో దైవత్వాన్ని వారికి చూపించాలి.
ప్రహ్లాదుడు
రాక్షస కుటుంబంలో జన్మించిన ప్రహ్లాదుడి గురించి ఇప్పటి బాలలకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మహావతార్ నారసింహ సినిమా చూసే ఉంటారుగా. హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు ఐదేళ్ల బాలుడే. తండ్రి దైత్య గురువులు ఎంత బోధించినా.. ఆ చిన్నారి నారాయణ నామస్మరణలో మునిగిపోయాడు. భగవంతుడు సర్వాంతర్యామి అని చాటిచెబుతూ తండ్రితో సవాల్ చేసి స్తంభంలోంచి నారాయణుడు .. నారసింహుడిలా ప్రత్యక్షమయ్యేలా చేశాడు. స్తంబంధంలోంచి బయటకు వచ్చిన నారసింహుడి ఉగ్రరూపాన్ని చూసి ఆ బాలుడు భయపడలేదు.. తన హృదయంలో ఉన్న నారాయణుడికి చేతులు జోడించి నమస్కరించాడు... బాల్యంలో నిర్భయత, నిజాయితీని మించిన అపారమైన శక్తి ఇంకేం ఉంటుంది..ఈ తరం పిల్లలకు అలాంటి భక్తి, ధైర్యం నేర్పిస్తూ ఒత్తిళ్లకు లొంగని విధంగా పెంచగలగాలి..
ధ్రువుడు
పట్టుదలకు, లక్ష్యసాధనకు మరోరూపం ధృవుడు. తండ్రి ఒడి నుంచి సవతి తల్లి దించేసిందనే అవమానంతో అడవికి పయనం అయిన ధృువుడికి నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఉపదేశించాడు. ఆ బాలుడు తపస్సు చేసి భగవంతుడి అనుగ్రహంతో పాటూ తండ్రిప్రేమను పొంది చిరస్థాయిగా నిలిచే ధృవనక్షత్రంగా మారాడు. అంటే..ఎప్పటికీ స్థిరంగా మెరిసే దివ్యత్వం సాధించాడు. బాల్యంలో సంకల్ప శక్తి లోకాల్ని మార్చగలదు...ఈ దిశగా చిన్నారులు అడుగు వేయాలంటే వారికి ధ్యానం నేర్పించాలి..వారిలో అంతర్గత శక్తిని జాగృతం చేయాలి
గణేశుడు
తల్లి పార్వతి సృష్టించిన పిండిబొమ్మ అయిన గణేషుడు.. శివుడితో యుద్ధం చేసి..తల మార్చుకుని విఘ్నాలు తొలగించే దేవుడయ్యాడు. జ్ఞానం సృజనాత్మకతకు మూలం అని గణేషుడి కథ చెబుతుంది. పిల్లల్ని కేవలం పుస్తకాలతో కుస్తీపట్టమని చెప్పకుండా.. వారి ఊహలకు రెక్కలు అద్దాలి. మొబైల్ ఫోన్లు, టీవీల ముందు అతుక్కుపోయిన పిల్లలకి..బాల్యంలో ప్రతిక్షణం ఎంత ముఖ్యమైనదో అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పాలి.
చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం ఇచ్చిన చాక్లెట్లు చిటికెలో తినేస్తారు..బహుమతులు రెండుమూడుసార్లు ఆడి విరగ్గొట్టేస్తారు..అయితే ఇవి ఇవ్వొద్దు అని కాదు..ఇవ్వండి..కానీ వాటితో పాటూ.. వారి భవిష్యత్ అని అందంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజు నుంచే ప్రణాళిక రచించండి. నిత్యం కాసేపు ధ్యానం, వారిలో స్ఫూర్తి నింపే పురాణ కథ...నిత్యం ఓ మంచి పని.. ఓ మంచి మాట చాలు..వారిని దివ్యంగా మార్చేస్తాయ్.
ఎందుకంటే...
ఆధ్యాత్మిక యాత్ర మొదలయ్యే పవిత్ర క్షణం, మంచి ముహూర్తం బాల్యమే..
కృష్ణుడి లీలలాగా ఆటలో దైవత్వాన్ని చూడాలి
ప్రహ్లాదుడిలా భక్తితో నిండి ఉండాలి
ధ్రువుడిలా సంకల్పంతో ముందుకు సాగాలి
గణేషుడిలా జ్ఞాన సముపార్జన చేయాలి...
ఇవే మన పిల్లలకు మనం అందించే బహుమతులు, ఆస్తులు..






















