Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Balineni Srinivasa Reddy: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరిస్థితి బాగా ఇబ్బందుల్లో ఉంది. ఒక్కొక్కరు కీలకమైన నేతలు పార్టీని వీడిపోతున్నారు. ఆ జాబితాలోనే జగన్ సన్నిహితుడు కూడా చేరిపోయారు
![Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది? YSRCP Leader former minister balineni srinivasa reddy will meet andhra Pradesh Deputy Cm pawan kalyan today Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/4414e7bb9dfe3ce7b6305575d80fc3661726707751137215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP Leader Balineni Srinivasa Reddy Will Meet Deputy Cm Pawan Kalyan: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కాబోతున్నారు. బుధవారమే వైసిపికీ రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరడం ఇక లాంఛనమే. ఏదైనా అనూహ్య అడ్డంకి వస్తే తప్ప బాలినేని జనసేన కండువా కప్పుకోవడం కన్ఫర్మ్ అయిపోయినట్టే.
వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరుతున్న పెద్ద నాయకుడు ప్రస్తుతానికి బాలినేనే. ఒంగోలు రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని చేరికతో ఆయా జిల్లాల్లో జనసేన క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటుందని విశ్లేషకులు అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు. అయితే బాలినేని ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా పెద్దతంగమే నడిచింది.
ఎన్నికల ముందు నుంచే దూరం
2024 ఎన్నికల తరువాత బాలినేని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారు. జగన్ మొదట్లో జరిపిన సమీక్షా సమావేశాలకు బాలినేని హాజరు కాలేదు. కొంత కాలం పాటు ఆయన ఢిల్లీ,హైదరాబాదుల్లోనే కాలం గడిపారు అంటారు. అసలు అధికారంలో ఉన్న సమయంలోనే మంత్రి పదవి విషయంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో బాలినేనికి విభేదాలు వచ్చాయి. తాత్కాలికంగా సద్దుమణిగినా ఎన్నికల తర్వాత అవి ఎక్కువయ్యాయి.
ఈవీఎంలపై ఒంటరి పోరు
ఎన్నికల ఫలితాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించిన బాలినేని ఆ పోరాటాన్ని కంటిన్యూ చేశారు. మధ్యలో ఒంగోలు వచ్చిన తనపై గెలిచిన దామచర్ల జనార్దన్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు. దానితో వారిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే మండే పరిస్థితి నెలకొంది. బాలినేని చేస్తున్న విమర్శలను కూటమి ప్రభుత్వం కొట్టి పారేసింది. ఇంతలా ఒంటరి పోరాటం చేస్తున్న తనకు సొంత పార్టీ వైసిపి నుంచి కానీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచిగాని ఎలాంటి సపోర్టు రాలేదని సన్నిహితుల వద్ద బాలినేని బాధపడ్డారని సన్నిహితులు చెబుతారు. అప్పుడే పార్టీ మారాలని బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారట. అయితే స్థానిక ఎమ్మెల్యే టిడిపి కాబట్టి అటు వెళ్లడం కంటే జనసేనలోకి వెళ్లడమే కరెక్ట్ అని బాలినేని భావించారట. సన్నిహితులకు అనుచరులు కూడా వెళితే జనసేనలోకి వెళ్ళండి తప్ప వేరే పార్టీలోకి వద్దు అని నెల క్రితమే సూచించారని చెబుతున్నారు. తర్వాత మరోసారి బాగా సమీక్షించుకొని పవన్ని కలవాలని నిర్ణయం తీసుకున్నారు.
మరి వాటి సంగతి ఏంటి?
అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూ పదే పదే ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్న జనసేనలో చేరితే ఆయన చేసినవి తప్పుడు ఆరోపణలు అని ఒప్పుకున్నట్టేనా అన్న గుసగుసలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి కూటమి వైపు వచ్చే నేతలను వారి విధానాలను సమీక్ష చేయడానికి ఏర్పాటుచేసిన కమిటీ బాలినేని చేరికకు జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అని కూడా స్పష్టత రావాల్సి ఉంది.
జగన్ పాలనలో అక్రమాలు జరిగాయని శ్వేత పత్రాలు విడుదల చేసే సమయంలో సీఎం చంద్రబాబు ఒంగోలులో 100 కోట్ల పైచిలుకు విలువైన భూ అక్రమాలు జరిగాయని అన్నారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికీ తెలిసిందే. ఇన్ని ఆరోపణలు అనుమానాల మధ్య పవన్, బాలినేని భేటీ ఆసక్తిగా మారింది. ఇది పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Also Read: జగన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బాలినేని - వైసీపీకి రాజీనామా - రేపో మాపో జనసేనలో చేరిక !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)