KCR Delhi Tour : బీఆర్‌ఎస్‌పై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయలేదెందుకు? ఢిల్లీలో రహస్య భేటీల ఎజెండా ఏమిటి ?
బీఆర్ఎస్ జెండా, అజెండా గురించి కేసీఆర్ ప్రజలకు ఇంకా ఎందుకు చెప్పడం లేదు..? ఢిల్లీ సీక్రెట్ మీటింగ్‌లలో ఏం జరుగుతోంది ?
KCR Delhi Tour : భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి ఢిల్లీ చేరి మూడు రోజులు అయింది. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అని తీర్మానం చేసిన రోజున జెండా, అజెండాల గురించి కేసీఆర్ వివరిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. మీడియాతో మాట్లాడలేదు. అసలు ఇప్పటి వరకూ మాట్లాడలేదు. బీఆర్ఎస్ గురించి ఎలాంటి సమాచారమూ ఆయన నోటి నుంచి ప్రజలకు చెప్పలేదు. అంతర్గతంగా జరిగిపోతోంది. కేసీఆర్ ఎందుకీ గోప్యత పాటిస్తున్నారు ? మూడు రోజులుగా ఢిల్లీలో సీక్రెట్ సమావేశాల వెనుక ఏ వ్యూహం దాగి ఉంది ?
ప్రజలకు "బీఆర్ఎస్" కబురు చెప్పని కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితిని... భారత రాష్ట్ర సమితికి మార్చాలని తీర్మానం చేసి ఈసీకి ఇచ్చారు. ఇక ఎన్నికల సంఘం మిగతా ప్రక్రియ పూర్తి చేస్తుంది. అయితే ఇలా తెలంగాణ ప్రజలు రెండు సార్లు పట్టం కట్టిన పార్టీ పేరును మారుస్తున్నట్లుగా... కేసీఆర్ ఇంకా తన నోటి ద్వారా ప్రజలకు చెప్పలేదు. తీర్మానం చేసినరోజున మీడియాతో మాట్లాడతారనుకున్నా జరగలేదు. జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారని అనుకుంటున్నారు. కానీ ఢిల్లీ చేరి మూడు రోజులు అయినా ఇంత వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కనీసం ప్రెస్ మీట్ ఉంటుందని కూడా ఎవరూ చెప్పడంలేదు. కేసీఆర్ ఎందుకింత గోప్యత పాటిస్తున్నారన్నది టీఆర్ఎస్ వర్గాలకు అంతు చిక్కడం లేదు.
ఢిల్లీలో రహస్య భేటీలేక ప్రాధాన్యత !
ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట కవిత, సంతోష్ కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ అధికారికంగా ఎవరితోనూ భేటీ అయనట్లుగా సమాచారం లేదు. మూడు రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఓ రోజు బీఆర్ఎస్ కోసం లీజుకు తీసుకున్న భవనాన్ని.. మరో రోజు సొంతగా కడుతునన్ భవనాన్ని పరిశీలించారు. ఆ నిర్మాణం మరో ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉంది. మిగతా సమయాల్లో ఆయన ఎవరితో భేటీ అవుతున్నారో టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారని.. ఖాళీగా మాత్రం లేరని చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఉత్తరాదికి చెందిన కొంత మంది రాజకీయేతర ప్రముఖులతో మాట్లాడుతున్నారని వారిని పార్టీలో చేర్చుకుని బాధ్యతలిచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
లిక్కర్ స్కామ్ నుంచిపార్టీ నేతల్ని కాపాడే ప్రయత్నాలంటున్న విపక్షాలు !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న అభిషేక్ రావు చుట్టూ ఇప్పుడు దర్యాప్తు నడుస్తోంది. ఆయనచాలా కీలక విషయాలు చెప్పారని సీబీఐ నుంచి లీకులొస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉండటంతో కేసీఆర్ .. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలను విపక్షాలు చేస్తున్నాయి. కేసీఆర్ ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారో స్పష్టత లేదు. కానీ కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నా.. అవి అంతర్గతంగానే ఉంటున్నాయి. అందుకే ఆయనపై లోపాయికారీ రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది.
అయితే భారత్ రాష్ట్ర సమితికి ఈసీ ఆమోదం తెలిపిన తర్వాత కేసీఆర్ అందరికీ క్లారిటీ ఇస్తారని.. ఇంకా అధికారికంగా పేరు మారకుండానే అన్నీ చెప్పడం మంచిది కాదని ఆగినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.