TDP Somireddy : కేసీఆర్‌ను చూసి జగన్ నేర్చుకోవాలంటున్న టీడీపీ - ఈ మార్పు వెనుక ఏ రాజకీయం !?
టీఆర్ఎస్‌పై వైఎస్ఆర్‌సీపీ విమర్శలు చేస్తూంటే ... టీడీపీ పొగడ్తలు కురిపిస్తోంది. రాజకీయాల్లో ఈ మార్పు దేనికి సంకేతం ?
TDP Somireddy : యాధృచ్ఛికమో లేక, వ్యూహాత్మకమో తెలియదు కానీ.. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పై ఒకేరోజు భిన్నంగా స్పందించాయి. తెలంగాణలో సమస్యలు ముందు పరిష్కరించుకోండని వైసీపీ నేత సజ్జల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హేళన చేస్తే.. అదే రోజు టీడీపీ నుంచి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిసింది. వ్యయసాయ రంగం విషయంలో కేసీఆర్ అక్కడి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చెబుతున్నారు. గతలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీపై టీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో.. సోమిరెడ్డి సమర్థించడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
ఏపీలో విద్యుత్ సంస్కరణలు అమలు - తెలంగాణలో అమలు చేయడానికి కేసీఆర్ సర్కార్ వ్యతిరేకత
విద్యుత్ సంస్కరణలను ఏపీ సర్కార్ అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వాటిని అమలు చేసేది లేదని చెబుతోంది. అందే కాదు విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే రైతుల మెడకు ఉరి వేయడమేనని ప్రచారం చేస్తోంది. ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే వ్యవహారంలో కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేశారని, రైతులకోసం ఆయన మోదీని సైతం ఢీకొంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిప్ంచారు. మీటర్లు పెట్టనన్నాడు, 24 గంటలు కరెంటు ఇస్తున్నాడు, ఎకరాకి 19వేలు రైతుబందు ఇస్తున్నాడు, ధాన్యం కొనుగోలు చేసిన మూడో రోజు రైతు ఖాతాలో డబ్బులేస్తున్నారంటూ కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు.
కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేస్తున్నారంటున్న టీడీపీ నేత సోమిరెడ్డి
పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అంత చేస్తుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం మోటర్లకు మీటర్ల పేరుతో రైతుల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఏడు గంటలే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని విమర్శించారు. 3వేల కోట్ల రూపాయల అప్పుకోసం వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల్ని వంచిస్తున్నారని చెప్పారు సోమిరెడ్డి. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి తీరుతామని విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారని.. దీని వల్ల ఆదాయం ఆదా అవుతుందని చెప్పారని.. మంత్రికి తాను సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానంటూ.. మీటరు పెడితే విద్యుత్ తక్కువ ఎలా అవుతుందని ప్రశ్నించారు. 18లక్షల మీటర్లకు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో కమిషన్ మిగుల్చుకునేందుకే విద్యుత్తు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లుందని విమర్శించారు. 12 గంటలు కరెంటు ఇస్తామని 5 గంటలకు తగ్గించారన్నారు. విద్యుత్తు మోటర్లకు మీటర్లు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే వెనక్కు తీసుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు.
మోటార్లకు మీటర్లు పెట్టి తీరుతామన్న పెద్దిరెడ్డి
తెలంగాణ లో మీటర్ల నిర్ణయాన్ని అక్కడి సీఏం కేసీఆర్ వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ సీఏం జగన్ రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయవద్దని, ఏ ఒక్కరూ విద్యుత్తు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవద్దంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు సూచించారు. మోటర్లకు మీటర్లు పెట్టుకోకపోతే ఏమవుతుందో తేల్చుకుందాం అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.కేసీఆర్‌ను ఆదర్శంగా టీడీపీ చెబుతూండటం...టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కరెంట్ విషయంలో విమర్శించలేకపోవడం... వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది.