Telangana BJP Master Plan : వచ్చే నెల నుంచి బీజేపీ అసలు రాజకీయం - తెలంగాణకు బ్లూ ప్రింట్ రెడీ చేసిన హైకమాండ్ !
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఏం చేయబోతోంది ?ఆగస్టు నుంచి మాస్టర్ ప్లాన్ అమలు !రూట్ మ్యాప్ రెడీ చేస్తున్న హైకమాండ్రాజకీయంగా సంచలనాలు ఉంటాయా ?
Telangana BJP Master Plan :తెలంగాణ బీజేపీ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో కొత్తగా కొంత మందికి పదవులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు కార్యాచరణ రెడీ చేసుకుంది. ల బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనేలా ఉన్న బీజేపీకి మునుపటి పరిస్థితులు తీసుకురావడానికి రెడీ అయ్యారు. ఇందు కోసం అగ్రనాయకత్వం కూడా రంగంలోకి దిగిందని చెబుతున్నారు.
తెలంగాణలో అధికారం చేపట్టాలన్నదే లక్ష్యం
కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకత్వం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేని నిరూపించాలని అనుకుంటున్నారు. జనాల్లోకి మరింత దూసుకెళ్లి.. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వైఫల్యాలను ఎండగట్టాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. జూన్-15న ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది అధిష్టానం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సభ జరగలేదు. జూలై-29న అదే ఖమ్మం గడ్డపై సభ నిర్వహించాలని ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.
ఆగస్టులో బీజేపీ యంత్రాంగం అంతా తెలంగాణలోనే
ఆగస్ట్-15 తర్వాత తెలంగాణలో బీజేపీ పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పర్యటించనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు పర్యటించబోతున్నట్లు రాష్ట్ర బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఈ పర్యటన చాలా వ్యూహాత్మకంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఆ డేటాతో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు పర్యటించినప్పుడు ఆయా బీఆర్ఎస్ నేత చిట్టా తీయబోతున్నారు కమలనాథులు. ఇలా వారి ఆస్తులు, అవినీతిని ప్రజల ముందు ఉంచితే ఎవర్ని నమ్మాలనేదానిపై ఓ నిర్ణయానికొస్తారని బీజేపీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలూ వస్తాయా ?
అటు అమిత్ షా పర్యటన, ఇటు వరుసగా 119 మంది ఎమ్మెల్యేల పర్యటనతో పక్కా వ్యూహంతోనే అగ్రనాయకత్వం రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది. బీజేపీ వచ్చే ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తాయన్న ఓ ప్రచారం ఉంది. ఇక్కడా అది జరుగుతుదంని ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. అవి ప్రారంభమైన తర్వాత చేరికలు కూడా పెరుగుతాయని అంటున్నారు. పార్టీలో వలసులు ఉంటాయని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే, ఎన్నికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు.