Janasena TDP Alliance : ఇంతకీ పవన్ కోరుకుంటున్న "గౌరవం" ఎలాంటిది ? అసెంబ్లీ సీట్లా ? పదవా ?
పొత్తులు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ కోరుకుంటున్న గౌరవం ఏమిటి ? టీడీపీ ఏమనుకుంటోంది ?
Janasena TDP Alliance : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు చాలా రోజుల నుంచి చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తులు కుదురుతాయా లేదా అన్నది అందులో ముఖ్యమైనది. వారి మధ్య పొత్తులు కుదిరితే రాజకీయం మారిపోతుందన్న అంచనాలు ఉండటమే దీనికి కారణం. ఈ అంశంపై పవన్ కల్యాణ్ రణస్థలం వేదికగా యువశక్తి సభలో ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రజలందరూ మద్దతుగా నిలిస్తే ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధమేనన్నారు. అయితే హింసించేవాడు ఒక్కడే అయితే కలసి పోరాడటంలో తప్పు లేదని.. పొత్తులకు తాను సిద్ధమేనన్నారు. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయన్నట్లుగా "సరైన గౌరవం" లభిస్తేనే అనే మాట కూడా ఉపయోగించారు. సరైన గౌరవం అంటే ఏమిటి ? పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి ఏం ఆశిస్తున్నారు ?
పొత్తులు పెట్టుకోవాలంటే గౌరవం లభించాల్సిందేనంటున్న పవన్
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి 2014లో మద్దతు ఇచ్చారు కానీ ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పూర్తిగా మద్దతు ప్రకటించారు. అప్పుడే పార్టీ పెట్టినందున ఎన్నికల్లో పోటీ చేయడం అంత తెలివైన నిర్ణయం కాదన్న కారణంగా వెనక్కి తగ్గారు. కానీ 2019కి వచ్చే సరికి ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. తొలి నాలుగేళ్లు ఆయన టీడీపీ ప్రభుత్వంతో సన్నిహితంగానే ఉన్నారు. తన వద్దకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఆయన ప్రభుత్వం ద్వారా భరోసా కల్పించేవారు. పవన్ కల్యాణ్ మాటలకు అప్పటి ప్రభుత్వం కూడా విలువ ఇచ్చేది. పరిష్కారాలు చూపించేది. అయితే ఎన్నికలున్న చివరి ఏడాది మాత్రం పవన్ కల్యాణ్ రూటు మార్చారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి విడిగా పోటీ చేశారు.
ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తే పవన్ గౌరవంగా భావిస్తారు ?
ఎన్నికల్లో ఆరు శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకోవడం.. తాను రెండు చోట్ల ఓడిపోవడమే కాదు.. కేవలం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమవడంతో తర్వాత రాజకీయం మార్చుకున్నారు. పార్టీని నడుపుకోవడం కోసం అయినా సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి ప్రభుత్వం నుంచి ఆయన కూడా వేధింపులు ఎదుర్కోవడంతో.. గతంలోలా ఓట్ల చీలిక కోసం కాకుండా.. ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నారు. అయితే తనకు తగ్గ గౌరవాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఆ గౌరవం ఏమిటనేది ఇప్పుడు కీలకం. ఆయన కోరుకుంటున్న గౌరవం ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుందా అన్నది మరో అంశం.
గౌరవం సంగతి తేలితేనే పొత్తులు కొలిక్కి !
పొత్తులు అంటే రెండు పార్టీల మధ్య ప్రధానంగా వచ్చేది సీట్ల పంపకంలో తేడాలు. ఓ పార్టీ అత్యధిక సీట్లు కోరుకుంటుంది. మరో పార్టీ మాత్రం తామే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని అనుకుంటుంది. అది సహజం. పవన్ కల్యాణ్ తన పార్టీ బలానికి తగ్గట్లుగా ఎన్ని సీట్లు ఇస్తే గౌరవంగా ఫీలవుతారనేది ఇప్పటి వరకూ అంచనాలకు రాలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటయితే.. అప్పుడు ఎలాంటి గౌరవాన్ని కోరుకుంటారనేది మరో కీలకమైన అంశం. అయితే రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను అంతర్గతంగా చర్చించుకుని పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తాయి. తెలుగుదేశం పార్టీ .. పవన్ ఏ స్థాయి గౌరవం ఇవ్వాలనుకుంటోంది.. పవన్ ఏ స్థాయి గౌరవం కోరుకుంటున్నారన్న దానిపై ఏపీలో పొత్తు పొడుపు ఉంటుందని అనుకోవచ్చు.