KCR For Rahul : టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు దగ్గరగా జరుగుతోందా ? రాహుల్‌పై బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం ఎందుకు ?
KCR For Rahul : రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ మాట్లాడటం ఇప్పుడు రకరకాల చర్చలకు కారణం అవుతోంది. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ దగ్గరగా జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR ) అనూహ్యంగా రాహుల్ గాంధీకి సపోర్ట్‌గా నిలిచారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై ( Rahul Gandhi ) అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తండ్రెవరో ఆధారాలు అడిగామా అంటూ ప్రశ్నించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ అంశాన్ని కేసీఆర్ కూడా భవనగిరి సభలో ప్రస్తావించారు. అసోం సీఎం ( Assam CM Sarma ) మాటలు చాలా దారుణం అని.. అవి భారతీయ సంస్కృతిని విమర్శించడమేనన్నారు. ప్రధాని మోడీకి భారతీయ సంస్కృతిపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తక్షణం బిశ్వ శర్మను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌పై బీజేపీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన కేసీఆర్ !
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎంత విమర్శించుకున్నా కేసీఆర్ జోక్యం చేసుకున్న సందర్భాలు దాదాపుగా లేవు. ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ దలదూర్చి బీజేపీ ముఖ్యమమంత్రిని తొలగించాలని డిమాండ్ చేయడం కాస్త అనూహ్యమే. జాతీయ రాజకీయాల ( National Politics ) కోణంలో కేసీఆర్ ప్రకటన చూస్తే ఖచ్చితంగా ఓ ప్రత్యేకమైన సందర్భం అని అనుకోక తప్పదు. ఎందుకంటే కేసీఆర్ సరిగ్గా ఇలాంటి విమర్శలే ఏపీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేశారు. తెలంగాణ నుంచి పలువురు నేతలు ఈ విషయాన్ని ఖండించారు కానీ కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు. పైగా ఆ విమర్శలు ఎన్టీఆర్ కుమార్తెను కించ పరిచేలా ఉన్నాయి. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా కేసీఆర్ స్పందిస్తారని అనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ కేసీఆర్ అప్పుడు స్పందించలేదు కానీ రాహుల్ గాంధీపై ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే బీజేపీ నేతలు చేస్తే స్పందించారు.
మోడీకి బదులుగా మరోకొరిని ఢిల్లీ పీఠంపైకి తెచ్చుకుంటామన్న కేసీఆర్ !
ఇలా విశ్లేషించడానికి మరో కారణం కూడా ఉంది. శుక్రవారం కేసీఆర్ జనగామ సభలో ప్రసంగస్తూ మోడీ తెలంగాణకు ఏమీ ఇవ్వకపోతే ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం.. మాకిచ్చేవాడిని తెచ్చుకుంటాం అన్నారు. అంటే కేసీఆర్ ఖచ్చితంగా బీజేపీయేతర పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారన్నమాట. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీతో కాస్త సన్నిహితంగా వ్యవహరించినా ఇబ్బందికరం అవుతుంది. అందుకే జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కాస్త దగ్గరగా జరగడానికి సిద్ధమేనన్న సంకేతాలను కేసీఆర్ పంపారని అనుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని అనుకుంటున్నారా ?
ఢిల్లీలో ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీతో ( Congress Party ) కలిసి టీఆర్ఎస్ కొన్ని సమావేశాల్లో పాల్గొంటోంది. మూడు రోజుల కిందట ప్రధాని మోడీపై ( Narendra Modi ) టీఆర్ఎస్ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మద్దతు పలికింది. ఇప్పుడు కేసీఆర్ రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు పరిస్థితి కలిసి రావడం లేదు. ఎవరూ ప్రత్యేక కూటమికి సిద్ధం కావడం లేదు. ఈ కారణంగా ఆయన కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ మారుతున్న జాతీయ రాజకీయాల లెక్కల కోణం ఇందులో ఇమిడి ఉందేమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.