Wyra politics: వైరా గులాబీలో త్రిముఖ పోటీ- నిలిచేదెవరు? గెలిచేదెవరు?
వైరా నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టిక్కెట్ వేటలో ఒకే పార్టీకి చెందిన ముగ్గురు పోటీ పడటం టిక్కెట్ ఎవరిని వరిస్తుందనే చర్చ సాగుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా స్టైలే వేరు. వర్గరాజకీయాలకు పెట్టింది పేరు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రూప్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వైరా నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సీనియారిటీ పేరుతో ఒక్కరు సిట్టింగ్ పేరుతో మరొక్కరు.. ప్రజాదరణ పేరుతో ఇంకొకరు తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ఇప్పుడు గులాబీ పార్టీలోనే ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటం అక్కడున్న కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎవరికి వారే ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకుని ఎలాగైనా టిక్కెట్ సాధిస్తామంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాములు నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తెలంగాణలో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
రాములు నాయక్ రాకతో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్‌ఎస్ పార్టీ నేత బానోత్ మదన్‌లాల్ వర్గం జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఎమ్మెల్యే రాములు నాయక్, మదన్‌లాల్ ప్రత్యేక వర్గాలుగా విడిపోయారు. గత మూడేళ్లుగా ఈ రెండు వర్గాల మధ్య వైరం తారాస్థాయిలో ఉంది. కొన్ని చోట్ల రెండు వర్గాలు దాడులకు పాల్పడటంతోపాటు, ఓ వర్గంపై కేసులు నమోదు చేసుకున్న సంఘటనలు నెలకొన్నాయి.
ఇటీవల కాలంలో రాములునాయక్ పనితీరుపై నియోజకవర్గంలో కొంత అసంతృప్తి నెలకొందన్న టాక్ నడుస్తోంది. దీన్నే అదునుగా చేసుకొని... తనకే టిక్కెట్ వస్తుందనే ఆశతో మదన్‌లాల్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన బానోత్ చంద్రావతి సైతం ఇటీవల కాలంలో నియోజకవర్గంపై ప్రత్యేకంగా పోకస్‌చేశారు. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పడం లేదు.
సీనియారిటీనా..? సిన్సియారిటీనా..? సిట్టింగా..?
వైరా నియోజకవర్గంలో ఇప్పుడు మూడు అంశాలపై ఈ ముగ్గురు టిక్కెట్ వేటలో పడ్డారు. 2009లో సీపీఐ తరుపున పోటీ చేసి గెలుపొందిన బానోత్ చంద్రావతి ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన బానోత్ మదన్‌లాల్ గెలుపొందడం, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. దీంతో చంద్రావతికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా నియమించింది.
2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బానోత్ మదన్‌లాల్ పోటీ చేయగా ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్ విజయం సాధించారు. ఆ తర్వాత రాములు నాయక్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఇక్కడ రెండు వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు. అయితే తరుచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే రాములునాయక్‌కు అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వదని, తనకే టిక్కెట్ వస్తుందని బానోత్ మదన్‌లాల్ ఆశలు పెంచుకున్నారు.
2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన బానోత్ చంద్రావతి సైతం ఇక్కడ టిక్కెట్ కోసం దూకుడు పెంచారు. తరుచూ నియోజకవర్గ పర్యటనలు చేయడంతో కార్యకర్తలను పెంచుకునే పనిలో పడ్డారు. ఇద్దరి మధ్య వైరంతో తనకు టిక్కెట్ వస్తుందని, పార్టీలో సీనియర్ తానే కావడంతో టిక్కెట్ తనకే వరిస్తుందని చంద్రావతి ఆశలు పెంచుకున్నారు. ఏది ఏమైనా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు వైరా నియోజకవర్గం నుంచి పోటీ పడుతుండటంతో ఎవరికి టిక్కెట్ వస్తుందనే విషయంపై ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది.