Komatireddy Congress : కోమటిరెడ్డి సోదరుల రాజకీయంతో కకావికలం ! చర్యలు తీసుకోలేక కాంగ్రెస్ అలుసైపోయిందా ?
కోమటిరెడ్డి సోదరుల రాజకీయంతో తెలంగాణ కాంగ్రెస్ కకావికలం అవుతోంది. చేయాల్సినంత చేసి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోగా.. మగతా పని పార్టీలోనే ఉండి వెంకటరెడ్డి చేస్తున్నారు. కానీ కాగ్రెస్ చర్యలు తీసుకోలేకపోతోంది.
Komatireddy Venkatreddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డిలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా నేత వ్యాఖ్యానించి ఉంటే ఈ పాటికి ఆ నేతను బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసేవారు. డిపాజిట్లు రావడం కష్టమైన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ నేతలు ఓడిపోయే సీటులో పోటీ ఎందుకు.. ప్రచారం ఎందుకు అని బయటకు వినిపించేలా మాట్లాడిన మరుక్షణం వారికి పార్టీలో చోటు ఉండదు. కానీ సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఓడిపోతే గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడిన నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా అవమానించారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. కాంగ్రెస్‌ది నిస్సహాయతా ? పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిసినా ఏమీ అనలేకపోతున్నారా ? అంతర్గత ప్రజాస్వామ్యం కాస్తా శ్రతి మించిన క్రమశిక్షణా రాహిత్యం అని అనిపించడం లేదా ?
పదే పదే కాంగ్రెస్ ను అవమానిస్తున్న కోమటిరెడ్డి సోదరులు!
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నేత. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన కుటుంబం అపర కుబేరులయ్యారని నల్లగొండ మొత్తం చెప్పుకుంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ సోదరుల వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డిదే ఆధిపత్యం. ఆయన చనపోయాక.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అధికారం పోయిన తర్వాత మరింతగా మారిపోయింది. రెండో సారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా అని ప్రతీ నెలా చర్చ జరుగుతుంది. ఎన్నికలైపోగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలో చేరిపోవడానికి ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ఆయన చెప్పుకున్న ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో ఆ చేరిక ఆగిపోయింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు కానీ.. కనీసం చర్యలు తీసుకోలేకపోయారు.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు !
సోదరుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎప్పుడూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించని వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నిజానికి పీసీసీ చీఫ్ పదవిలో ఎవరు ఉన్నా... సోదరులిద్దరూ అసంతృప్తిగానే ఉంటారు. పొన్నాల లక్ష్మయ్య ఆ పదవిలో ఉన్నప్పుడు దండయాత్ర చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడూ అదే పరిస్థితి. తమకే పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే రేవంత్ రెడ్డికి చాన్సివ్వడంతో కోమటిరెడ్డి.. మాణిగం ఠాగూర్ క్యారెక్టర్ పైనే ఆరోపణలు చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. దీంతో కోమటిరెడ్డి సోదరులకు మరింత ధైర్యం పెరిగింది. తాము ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి చర్యలు తీసుకునే ధైర్యం లేదనుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యంం చేసే ప్లాన్ అమలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు !
మునుగోడు ఉపఎన్నిక వెనుక ప్రధాన వ్యూహం .. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం. సిట్టింగ్ సీటులో ఆ పార్టీ రేసులో లేదని తేల్చడం ద్వారా.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు జరుగుతున్నట్లుగా రాజకీయం మార్చాలనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషణలు చేసి దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉపఎన్ని క పరిణామాలు చూస్తే అర్థం అయిపోతుంది. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా.. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి కోమటిరెడ్డి సోదరులే ప్లాన్ చేశారని అనుకోవాలి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం.. వెంటనే ఆమోదించడం.. ఉపఎన్నికలు రావడం.. ఇప్పుడు ఓట్లు రెండు పార్టల మధ్య పోలరైజ్ అయ్యే రాజకీయం జరగడం.. యాధృచ్చికం కాదు..రాజకీయమే. అంటే కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కోమటిరెడ్డి సోదులు వేసిన ప్లానే ఇదనుకోవచ్చు.
చర్యలు తీసుకుంటే ఒక ఎంపీ తగ్గుతారు.. తీసుకోకపోతే నిస్సహాయత బయట పడుతుంది...!
రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే స్పందించి చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రమయ్యేది కాదని కాంగ్రెస్ క్యాడర్ వాదన. కానీ ఆయనే రాజీనామా చేసేంత వరకూ వేచి చూశారు. గత కొద్ది రోజులుగా వెంకటరెడ్డి వ్యవహారశైలి .. కాంగ్రెస్ ను దారుణంగా వంచించేలా ఉంది. ఆయనపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారు. తీసుకున్నా .. తీసుకోకపోయినా ఉపఎన్నిక రాదని క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయినా చర్యలు తీసుకోలేనంత నిస్సహాయ స్థితికి కాంగ్రెస్ చేరింది. అందుకే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి.