Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Moosi : మూసీ నిర్వాసితులను అడ్డం పెట్టుకుని తమ ఫామ్ హౌస్‌లను కాపాడుకోవాలని పెద్దలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
CM Revanth : మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని బఫర్‌జోన్‌లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫాం హౌస్‌లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పరని విమర్శించారు. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయని.. ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి వచ్చిందన్నారు. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని.. చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరం ఎలా వరద భరిస్తుందని రేవంత్ ప్రశ్నించారు. గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలలో ప్రసంగించిన రేవంత్ కీలక వ్యాక్యలు చేశారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు... ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది.. ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా..మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వాలన్నారు.
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదని.. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయాలని రేవంత్ సలహా ఇచ్చారు. మీరు ఫామ్ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు... పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్సును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండని హరీష్, ఈటలకు రేవంత్ పిలుపునిచ్చారు. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదన్నారు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవాలని సలహా ఇచ్చారు. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు....సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.