PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
PM Kisan Samman Nidhi | రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదును ప్రధాని నరేంద్ర మోదీ జమ చేశారు.
PM Kisan Samman Nidhi amount distributed to Farmer Accounts : న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.20,000 కోట్ల నగదును విడుదల చేశారు. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 18వ ఇన్‌స్టాల్‌మెంట్ రైతులకు పెట్టుబడి సాయాన్ని శనివారం నాడు మోదీ విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రూ.2 వేలు జమ కానున్నాయి.
2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలను ఆదుకునేందుకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేల మొత్తాన్ని మూడు విడతలుగా పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారని తెలిసిందే. ఇప్పటివరకూ 17 దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం అందించింది. మధ్యవర్తుల ప్రమేయం, అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులను జమ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు మహారాష్ట్రలోని వాశింలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18వ విడత పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్లు 155261 / లేదా 011- 24300606కు ఫోన్ చేసి తమ సందేహాలను అడిగి క్లియర్ చేసుకోవచ్చు.
#WATCH | Addressing a public rally in Maharashtra's Washim, PM Narendra Modi says, "... 18th instalment of PM Kisan Samman Nidhi has been released today. 9.5 crores have received Rs 20000 crores today... I had the honour of awarding the beneficiaries of the Ladki Behan Yojana..." pic.twitter.com/hQfSGalQHv
— ANI (@ANI) October 5, 2024
అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి
ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ స్కీమ్ నిధులు విడుదల చేశారు. అయితే రైతులు లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ లో తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్‌లో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేస్తే నో యువర్ స్టాటస్ (Know Your Status) కనిపిస్తుంది. స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ కూడా నమోదు చేయాలి.
అక్కడ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ నమోదు చేసి, క్లిక్ చేస్తే పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా వస్తుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్ ఇలా తెలుసుకోవచ్చు
రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేకపోయినా మీ వివరాలు చెక్ చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియని వాళ్లు వారి ఫోన్ నెంబర్, ఆధార్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. నో యూవర్ స్టాటస్ లోనే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ (Know Your Registration Number) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ లేదా, ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. వివరాలు ఎంటర్ చేయడంతో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. ఆ తరువాత మీరు పైన తెలిపిన విధానం ద్వారా పీఎం కిసాన్ వెబ్ సైట్‌లో మీకు నగదు వస్తుందా లేదో తెలుసుకోవచ్చు.