Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Tirumala Srivari Annaprasadam | గత ప్రభుత్వంలో తిరుమలలో అన్న ప్రసాదాలు నాణ్యత లేవని సీఎం చంద్రబాబు చెప్పిన కొన్ని గంటల్లోనే ఓ భక్తుడికి అన్నంలో జెర్రి రావడం కలకలం రేపుతోంది.
Insect found at Srivari Annaprasadam In Madhava Nilayam in Tirumala | తిరుమల: తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి రావడం కలకలం రేపుతోంది. అసలే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అటు వైసీపీ, ఇటు కూటమి పక్షాలు మీది అపచారం అంటే మీది అని విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనంలో జెర్రి వచ్చింది. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రీ చూసి షాకయ్యాడు.
టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుల మండిపాటు
శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి కనపడంపై భక్తులు టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో పాటు అక్కడినుంచి తమను వెళ్ళిపోమన్నారని చెబుతూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన తిరుమల క్షేత్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్ చేస్తున్నారు. కాగా, శనివారం ఉదయమే తిరుమలకు వచ్చే భక్తులతో నడవడిక, అన్నదానంపై టిటిడి అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించిన గంటల వ్యవధిలో ఇది జరిగింది.
భక్తుడి ఆరోపణల్లో నిజం లేదు.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ అనే విషయంపై టీటీడీ స్పందించింది. శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ వచ్చిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అని, వదంతులను ఖండించారు. మాధవ నిలయంలోని తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి అన్నప్రసాదాలను తయారుచేస్తుంది. అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని భక్తుడు చెప్పడాన్ని మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని కలియపెట్టిన తరువాత పెరుగు కలుపుతారు. అలాంటప్పుడు జెర్రి ఏమాత్రం రూపు చెదరకుండా ఉంది అనేది.. కావాలని చేసిన చర్యగా అందరూ భావించాల్సి వస్తుంది. కనుక భక్తులు దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వీఐపీ సంస్కృతి తగ్గాలని టీటీడీకి చంద్రబాబు సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాలని ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ప్రముఖులు పర్యటించే సమయంలో హడావుడి అవసరం లేదన్నారు. తిరుమలలో శనివారం నాడు శ్రీ వకుళ మాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను చంద్రబాబు ప్రారంభించారు. తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడే పరిసరాలు ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో చంద్రబాబు సమీక్షలో టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు.
Also Read: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు - చిన్న శేష వాహనంపై మలయప్పస్వామి
గోవిందా అని వినిపిస్తే హిందువులు ఆగరని, అంతగా పట్టించుకోరని.. అదే అల్లా అని వినిపిస్తే ముస్లింలు ఎక్కడికక్కడ ఆగిపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేడు చంద్రబాబు తిరుమలలో పర్యటించి ఎన్నో మార్పులు చేర్పులు సూచించారు. గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా ఇప్పుడు చేయడం కుదరదని, తిరుమల ప్రతిష్టను పెంచాలని.. భక్తులకు సౌకర్యాలు మెరుగు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కొండపై గోవింద నామమే వినిపించేలా చూడాలన్నారు.