Perni Nani Wife: పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Andhra : మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై బియ్యం మాయం కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.
Perni Nani wife granted anticipatory bail: సొంత గోడౌన్లలో ఉంచిన పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం మాయం విషయంలో నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని జయసుధ పరారీలో ఉన్నారు. నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కావడం లేదు.
మచిలీపట్నంలో పేర్ని జయసుధ పేరుతో గోడౌన్లు ఉన్నాయి. అందులో పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యం పెద్ద మొత్తం కనిపించడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అధికారులు మొత్తం ఎంత బియ్యం ఉండాలి..ఎంత మిస్ అయిందన్నదానిపై ఆరా తీశారు. మొదట మూడున్నర వేల బస్తాలకుపైగా మిస్ అయ్యాయని గుర్తించి నోటీసులు జారీ చేశారు.
అయితే వే బ్రిడ్జి తప్పుగా నమోదు చేయడం వల్ల బియ్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్లుగా నమోదయ్యాయని పేర్ని నాని పౌరసరఫరాల శాఖ అధికారులకు వివరణ ఇచ్చారు. కానీ అదంతా బలంగా లేకపోవడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో .. ఫైన్ తో కలిపి రూ. కోటి 74 లక్షలకుపైగా చెల్లించారు. అయితే దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత డబ్బులు చెల్లిస్తే కేసు లేకుండా ఎలా ఉంటుందని టీడీపీ నేతుల మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ మిస్ అయిన రైస్ ఏడువేల బస్తాలకుపైగానే ఉంటుందని తాజాగా తేల్చినట్లుగా తెలుస్తోంది.
గోడౌన్లు తన భార్యపై ఉండటంతో పేర్ని నాని ఆమెను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న ఉద్దేశంతో కుటుంబంతో సహా ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు కూడా నోటీసులు జారీ చేశారు. వారు ఆజ్ఞాతంలో ఉండటంతో వారి ఇంటికి నోటీసులు అంటించారు. అయితే వారు హాజరు కాలేదు. బియ్యం స్కాం విషయంలో తమ తప్పేమీ లేదని.. ఒక వేళ ఉంటే పోయిన బియ్యానికి నగదు చెల్లిస్తామని పేర్ని నాని అంటున్నారు. అయితే తమను రాజకీయ కక్షలతో కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు పోలీసులు పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణకు రావాలని పిలిచే అవకాశం ఉంది. మరో వైపు ఈ అంశంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుుపులోకి తీసుకున్నారు. ఆయనే ఫిర్యాదు దారు. తన గురించి ఎక్కడ బయటకు వస్తుందో అని ఆయన ముందుగానే ఫిర్యాదు చేసినట్లుగా తెులస్తోంది. ఇప్పటికే ఏ టు గా ఉన్న గోడౌన్ మేనేజర్‌ను కూడ ాఅరెస్టు చేశారు.