TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?
ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్ల జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. అసలేం జరిగిందంటే ?
TRS MP Santosh Issue : టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీసు స్టేషన్ లో కొంత మంది ఫిర్యాదు చేశారు. అది ఆయన సొంత మండలం. అక్కడ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధిత సంఘం అధ్యక్షుడు కూస రవిందర్ ఈ ఫిర్యాదుచేశారు. నిజానికి ఎంపీ సంతోష్‌కు.. ముంపు ప్రాంతాల బాధితులకు సంబంధం లేదు .. ఇలా ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయం ఉంది. గత మూడు ,నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గతంగా జరుగుతున్నాయంటూ జరుగుతున్న కొన్ని ప్రచారాల కారణంగానే ఈ ఫిర్యాదును చేశారు.
ప్రగతి భవన్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న సంతోష్ రావు!
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను సంతోష్ రావు చక్కబెడుతూంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే సంతోష్ రావు గత నాలుగు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. ఈ కారణంగా పలు రకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సీఎం గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరవాత ఎప్పుడూ ఆయన ఇలా విధులకు దూరంగా లేరు. ఇటీవలి కాలంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందులో ఆయన పేరు వెలుగులోకి రావడం వంటి కారణాలతో .. ఆయన ఆజ్ఞాత వాసం హైలెట్ అయింది.
సంతోష్ రావు సన్నిహితులపై ఈడీ దాడులు!
ఇటీవల ఎంపీ సంతోష్ రావు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావు వ్యాపార సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు చెలామణి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిపై ఇంకా ఈడీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సంతోష్ రావు పాత్ర ఉందంటూ రాజకీయవర్గాలు ఆరోపణలు ప్రారంభించేశాయి. వెన్నమనేని శ్రీనివాసరావుతో సంతోష్‌కు ఉన్న సంబంధాల అంశంపై సీఎం కేసీఆర్ ఆయనను మందలించారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే సంతోష్ రావు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని ప్రగతి భవన్‌కు కూడా వెళ్లడం మానేశారని చెబుతున్నాయి.
అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చిన సంతోష్ రావు !
ఈ అంశంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూంటంతో ... కొంత మంది మీడియా ప్రతినిధులకు సంతోష్ రావు వివరణ ఇచ్చారు. ఆయన తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకునే ఉన్నారు. కానీ మీడియా ప్రతినిధులు మాత్రం తనపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. తాను మనిషినేనని.. తనకు అనారోగ్య, మానసిక సమస్యలు ఉండవా అని ప్రశ్నించారు. తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని.. ప్రగతి భవన్‌లోనే ఉన్నానని చెప్పారు. కేసీఆర్ లేకపోతే తాను నథింగ్ అని స్పష్టం చేశారు. సంతోష్ రావు వివరణతో టీఆర్ఎస్ వర్గాలు కూడా ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదని చెబుతున్నారు.
టీఆర్ఎస్‌లో అలజడి రేపుతున్న ఈడీ దాడులు !
ఢిల్లీలో లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత మూడు విడతలుగా ఈడీ సోదాలు చేసింది. అసలేం దొరికింది అన్న విషయం మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ీ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో కొన్ని కీలక పరిణామాలకు కారణం అవుతోంది. అందుకే డిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశం అవుతోంది.