Assembly challenge: సీఎం అసెంబ్లీ చాలెంజ్- కేసీఆర్‌దే చాయిస్ - హాజరు కాకపోతే రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Revanth :రేవంత్ పదే పదే అసెంబ్లీ సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ హాజరవుతారా?

Revanth Assembly challenge to KCR: తెలంగాణ రాజకీయాల్లో 'నీళ్ల' రాజకీయం మరోసారి పరాకాష్టకు చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, 40 టీఎంసీల లేఖ, డీపీఆర్ వెనక్కి రావడం వంటి అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ సంధించిన విమర్శల అస్త్రాలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూనే, దానిని అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని రేవంత్ ప్రతిసవాల్ విసరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ వేదికగా జల యుద్ధం
తెలంగాణ గడ్డపై నీళ్లను నిప్పులుగా మార్చాలన్న కేసీఆర్ వ్యూహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన ఆరోపణలను ఎండగట్టేందుకు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధైర్యముంటే సభకు వచ్చి వాస్తవాలు మాట్లాడండి అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ఒక రకంగా కేసీఆర్ సంధించిన వాటర్ బాల్ ను సిక్సర్‌గా మలిచి, ఆయననే డిఫెన్స్‌లోకి నెట్టడంలో రేవంత్ ప్రాథమికంగా విజయం సాధించినట్లు కనిపిస్తోంది.
చిచ్చు రాజేసింది కేసీఆరే.. తేల్చాల్సింది కూడా ఆయనే!*
రెండేళ్ల సుదీర్ఘ మౌనం తర్వాత కేసీఆర్ తన పాత ఆయుధమైన నీళ్ల సెంటిమెంట్ తో బరిలోకి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాళ్లు వేయడమే లక్ష్యంగా ఆయన చేసిన ప్రెస్ మీట్ రాజకీయంగా వేడి పుట్టించింది. అయితే, బయట మైకుల ముందు చెప్పే మాటలకు, చట్టసభల్లో చేసే చర్చకు చాలా తేడా ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిగా కేసీఆర్ చేసిన ఆరోపణలకు అసెంబ్లీలో ఆధారాలు చూపాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేవలం బహిరంగ సభలకే పరిమితమై, అసెంబ్లీని తప్పించుకుంటే అది ప్రజల కళ్లలో ధూళి చమ్మడమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసెంబ్లీకి రాకపోతే రేవంత్‌కు వన్ సైడ్ బ్యాటింగ్
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఆదివారం ప్రెస్ మీట్ ముగిశాక జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానం ఇవ్వడం చూస్తుంటే, ఆయన సభకు వచ్చేందుకు సుముఖంగా లేరని అర్థమవుతోంది. ఒకవేళ కేసీఆర్ సభకు హాజరు కాకపోతే, అది రేవంత్ రెడ్డికి రాజకీయంగా భారీ అడ్వాంటేజ్ కానుంది. కేటీఆర్, హరీష్ రావు సభలో ఉన్నప్పటికీ, కేసీఆర్ లేని ప్రతిపక్షం 'సేనాని లేని సైన్యం'లాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టే ఆధారాలు, చేసే ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి, దానికి కౌంటర్ ఇచ్చే బలమైన గొంతు సభలో లేకపోతే బీఆర్ఎస్ నైతికంగా దెబ్బతినడం ఖాయం.
చట్టసభను కాదని బహిరంగ సభలా?
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ మూడు బహిరంగ సభలు నిర్వహిస్తానని ప్రకటించడం గమనార్హం. సభలో ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, బయట ప్రజల్లో చెప్పుకుంటాననడం చట్టసభలను అవమానించడమే అవుతుంది. అసెంబ్లీలో జరిగే చర్చకు ఉండే చట్టబద్ధత, విలువ బహిరంగ సభలకు ఉండవు. బయట ఎంత ఎదురుదాడి చేసినా, అది కేవలం రాజకీయ విమర్శగానే మిగిలిపోతుంది. కేసీఆర్ లేని పక్షంలో రేవంత్ రెడ్డి రికార్డులతో సహా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే, బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోక తప్పదు.
మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు జనవరి 2వ తేదీ వైపు చూస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన వాదనను గట్టిగా వినిపించి పట్టు సాధిస్తారా? లేక సభను తప్పించుకుని రేవంత్ రెడ్డికి 'క్లీన్ స్వీప్' చేసే అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.





















