Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Revanth Reddy: కేసీఆర్ ఉన్నంత వరకూ తెలంగాణలో ఆయనకే పీఠం అనుకున్నవారి అంచనాలు తలకిందులై సంవత్సరం అయింది. ఆయన స్థానంలో రేవంత్ పదవి చేపట్టి ఏడాది అయింది. మరి వచ్చిన మార్పులేమిటి ?
One Year For Congress Rule : తెలంగాణలో కేసీఆర్ ముద్ర లేకుండా చెరిపేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించి ఖచ్చితంగా ఏడాది అవుతోంది. గత ఏడాది డిసెంబర్ ఏడో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ఏడాది కాలంలో ఆయన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణపై కేసీఆర్ ముద్ర లేకుండా చేస్తానని ఆయన బహిరంగంగానే చెబుతూంటారు. అందుకే దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కొన్ని సార్లు తీవ్రమైన విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. మరి ఏడాదిలో ఆయన కేసీఆర్ ను మరింపించేలా పాలన చేశారా ?. కేసీఆర్ పేరును తుడిచేసే ప్రయత్నంలో ఎంత సక్సెస్ అయ్యారు?
హైడ్రా, మూసి నిర్ణయాలతో ఎదురీత
రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో రెండు గట్టి ప్రయత్నాలు చేశారు. అందులో ఒకటి హైడ్రా, రెండు మూసి ప్రక్షాళన. హైడ్రాతో పెద్ద వాళ్ల ఆక్రమణల్ని కూల్చివేసినప్పుడు అందరూ జేజేలు కొట్టారు. ఎప్పుడైనా మధ్యతరగతి ఇళ్లజోలికి వెళ్లారో అప్పుడే రివర్స్ అయింది. దాంతో హైడ్రా బుల్డోజర్లను షెడ్డుకు పంపాల్సి వచ్చింది. మూసి విషయంలోనూ అంతే. డబుల్ బెడ్ రూంలు ఇచ్చి మూసి జనాల్ని ఖాళీచేయించాలనుకున్నారు కానీ ముందుకు సాగలేదు. ఇప్పుడు రెండు విషయాల్లో కోర్టుల నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎటు వైపు నుంచి ప్రారంభించాలో తెలియక.. ప్రారంభిస్తే ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు. కానీ ప్రారంభించలేకపోతున్నారు.
Also Read: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్టలు- విచారణకు ఛైర్మన్ ఆదేశం
కేసీఆర్ పథకాల్ని మరిపించలేకపోతున్న రేవంత్
మరో వైపు కేసీఆర్ ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలకు మంగళం పాడి కొత్త పథకాలను ప్రవేశ పెట్టాలనుకున్నారు. రుణమాఫీ అమలు చేశారు. సన్న వడ్లకు రూ. ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు. ఈ కారణంగా రైతు బంధు కన్నా ఎక్కువ మేలు జరుగుతుంది కాబట్టి ఆ పథకాన్ని ఆపేయాలనుకున్నారు. కానీ రైతుల నుంచి ఆ పథకం కూడా అమలు చేస్తారన్న అంచనాలు ఉండటంతో అమలు చేయక తప్పడం లేదు. ఇప్పుడు దళిత బంధు పథకం కోసం కూడా బీఆర్ఎస్ రోడ్డెక్కుతోంది. అలాగే మరికొన్ని పథకాల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.
అమలు చేసిన పథకాలపై సరిగ్గా ప్రచారం చేసుకోలేని వైనం
అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చారు. తర్వాత రుణమాఫీ చేశారు. కొొంత మంది సాంకేతిక కారణాల వల్ల కాలేకపోయినా దాదాపుగా ముఫ్పై లక్షల మంది రైతులకు రూ. రెండు లక్షల చొప్పున ప్రయోజనం లభించింది. గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అయితే వీటి వల్ల జరిగిన లబ్దిని వివరించి.. సానుకూలత పెంచుకోవడంలో మాత్రం అంత గొప్పగా ముందడుగు వేయలేదని చెప్పుకోవచ్చు. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి. వాటిపై పోరుబాట పట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.
Also Read: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
పాలన పరంగా.. హామీల అమలు పరంగా ఇబ్బందులు ఎదుర్కొటున్నప్పటికీ.. రాజకీయాల పరంగా అయితే విపక్షాలను గట్టిగా ఎదుర్కొటున్నారు. చాలా సార్లు వారిని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్‌కు పరిమితం కావడం.. రేవంత్ దూకుడు కారణంగా ఆయనదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే అనుకున్న విధంగా కేసీఆర్ ను మరిపించే పాలన చేయడంలో మాత్రం.. ముందడుగు వేయలేకపోయారని అనుకోవచ్చు.