Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Telangana News: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. తొలి విడతలలో స్థలం ఉన్న వాళ్లకే ప్రయార్టీ ఇస్తారు. రెండో విడతలో స్థలం లేని వారికి ప్రాధాన్యత ఇస్తారు.
Telangana CM Revanth Reddy Indiramma Illu Scheme: తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సర్వే యాప్‌ను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సర్వేను మొదట పైలట్ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేయనున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గొప్ప లక్ష్యం ఇందరిమ్మ ఇళ్ల కాన్సెప్టు తీసుకొచ్చారని అయితే వ్యవస్థలో లోపాలు కారణంగా ఎప్పటికప్పుడు దీని ఉద్దేశం దెబ్బతింటోందని అన్నారు. ఇసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్ట వెల్లడించారు. వివరాలు సేకరించిన తర్వాత ఆ వివరాల నుంచి నిజమైన లబ్ధిదారులను ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించబోతున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రచించామన్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు అనుతులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఆ దిశగానే అడుగులు వేస్‌తున్నామన్నార. తాము కొత్తగా ఇళ్లు నిర్మించడమే కాకుండా కేసీఆర్ హయాంలో సగంలో వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం అరవై నుంచి అరవై ఐదు వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు.
గోండులు, ఆదివాసీలు లాంటి వారికి మేలు చేసేలా ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని రూల్స్ సవరించినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్లకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారు. ఈసారి యాప్ ద్వారా సేకరించిన వివరాలు, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు క్రోడీకరించి లబ్ధిదారుల ఎంపికను ఏఐతో పూర్తి చేస్తామని తెలిపారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఇళ్లు అనేది ప్రతి ఒక్కరికీ ఒక సెంటిమెంట్ అని అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఆత్మ గౌరవంతో బతికేలా చూస్తామన్నారు. అందుకే ఆనాడు ఇందిమ్మ కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ప్రయత్నించారన్నారు. ఆ స్పూర్తితోనే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. రేషన్ కార్డు, సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకే తొలి విడతలో ప్రాధాన్యత ఇస్తామన్నారు రేవంత్. రెండో విడతలో స్థలం లేని వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నార రేవంత్ రెడ్డి. ఈ ఏడాదిలో తెలంగాణలో 4,16,500 ఇళ్లు నిర్మించనున్నారు. వీటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేయనున్నారు. మరోవైపు యాప్ లాంఛింగ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి నమూన ఆకట్టుకుటోంది.