Dharmapuri Arvind vs Jeevan Reddy: ఆర్మూర్‌లో హీటెక్కుతున్న రాజకీయాలు, MLA జీవన్ రెడ్డిపై అరవిందే బరిలో నిలిచేనా !
Jeevan Reddy vs Dharmapuri Arvind: టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (TRS MLA Jeevan Reddy), బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య ఇటీవల మాటల యుద్ధం నడుస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పొలిటికల్ స్ట్రీట్ లో రానున్న రోజుల్లో హాట్ హాట్ కాబోతున్నాయా అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ రాజకీయం నడుస్తోంది. కొత్తగా టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (TRS MLA Jeevan Reddy), బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య ఇటీవల మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వంటే నువ్వా అనేలా వారి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.
మాటల యుద్ధం పెరగటానికి కారణం ఏంటంటే..
ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అరవింద్ (Dharmapuri Arvind) పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే ఆయన కాన్వాయ్ పై దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక అసలు కారణం ఎవరనేది ఒక కెత్తు... రైతులు చేశారని టీఆర్ఎస్ పార్టీ పసుపు చెబుతుంటే... బీజేపీ మాత్రం టీఆర్ఎస్ గుండాలు చేశారని ఆరోపించింది. సుమోటోగా కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు దీనిపై అలసత్వం వహిస్తున్నారని ఎంపీ అరవింద్ ఆరోపణ. అయితే ఇక్కడి నుంచే మాటల యుద్ధం మొదలైంది. దాడి జరిగిన రోజు ఎంపీ అరవింద్ ఆర్మూర్ లో జీవన్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడగొడతానని సవాల్ విసిరారు. ప్రతి సవాల్ గా జీవన్ రెడ్డి కూడా స్పందించారు. మాటల యుద్ధమే నడిచింది. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. దీంతో ఆర్మూర్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు.
అరవింద్ సవాల్‌తో మొదలైన చర్చ..
ఎంపీ అరవింద్ విసిరిన సవాల్ తో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆర్మూర్ నుంచి అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా అన్న చర్చ సాగుతోంది. 50 వేల మెజార్టీతో ఓడగొడతామని అరవింద్ చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో అరవింద్ పోరు అక్కడి నుంచే ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఒక వేళ నిజంగా అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఆర్మూర్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఓ వైపు రెండు సార్లు జీవన్ రెడ్డి ఆర్మూర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. పాలిటిక్స్‌కు ఎంట్రీ ఇవ్వగానే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఆసక్తికర విజయం అందుకున్నారు అరవింద్. బీజేపీలో ఎంపీ అరవింద్ అతితక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. మరోవైపు జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం జిల్లా బాధ్యతలు అప్పగించింది. జీవన్ రెడ్డి కూడా దూకుడుగా ఉంటారు. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఆసక్తిగా ఉంటుందన్న చర్చ జోరుగా ఉంది.
అరవింద్ సవాల్ తో నిజంగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఆర్మూర్ నుంచే ఎమ్మెల్యేగా బరిలో దిగితే... జీవన్ రెడ్డిపై పోటీ రసవత్తరంగా సాగుతుందంటున్నారు. అయితే ఆర్మూర్ లో సామాజిక కోణం, బలా బలాలు చూస్తే.... గతంలో కంటే ఆర్మూర్ లో బీజేపీ పార్టీ బలంగా మారుతోంది. కొందరు టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీకి ఆర్మూర్ నియోౌజకవర్గంలో మంచి ఫలితాలే వచ్చాయ్. ఆర్మూర్ టౌన్ లో కూడా బీజేపీ పట్టుసాధిస్తున్నట్లు కనిపిస్తోంది.
సామాజిక కోణంలో చూస్తే..
సామాజిక పరంగా చూస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండగా, తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. అరవింద్ మున్నూరు కాపు సామాజికవర్గం నేత. రెడ్డి సామాజికవర్గం నేత జీవన్ రెడ్డి. దీంతో ఇక్కడ పోరు ఆసక్తిగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారతాయ్. సో అరవింద్ సవాల్ తో ఆర్మూర్ పోలిటికల్ స్ట్రీట్ లో హీట్ మొదలైందనే చెప్పుకుంటున్నారు. మరోవైపు అరవింద్ ఆర్మూర్ లో తన క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ పర్యటనలు చేస్తున్న చోట్ల టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు జిల్లా రాజకీయాలను సవాల్ గా తీసుకుంటున్నారు.
Also Read: MLA Balka Suman: రేవంత్ రెడ్డి చిప్ దొబ్బింది, ఎర్రగడ్డలో జాయిన్ చేస్తే బెటర్: బాల్క సుమన్