KCR, PK And Prakash Raj: ఫామ్‌హౌస్‌లో పీకే, ప్రకాష్ రాజ్ ! కేసీఆర్ నేషనల్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా ?
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్‌లతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. తెర వెనుక పీకే, తెర ముందు ప్రకాష్ రాజ్ ఉంటూ KCR కటౌట్‌తో రాజకీయాలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
KCR, PK And Prakash Raj in Erravelli: తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చాలా బిజీగా గడిపినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్‌లతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్‌తో కీలక విషయాలు చర్చించేందుకు పీకే ఢిల్లీ నుంచి వచ్చారు. ప్రకాష్ రాజ్ ను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆషామాషీగా ప్రయత్నాలు చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. తన తరపున వ్యూహాకర్తల్ని, బరిలోకి దిగేవారినీ కేసీఆర్ పక్కాగా ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పీకే, ప్రకాష్ రాజ్‌లతో ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు !
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం దేశంలో నెంబర్ వన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పేరున్న ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని ఇప్పటి వరకూ బయట జరుగుతున్న ప్రచారమే. అందులో నిజం ఎంత ఉందనేది టీఆర్ఎస్ వర్గాలకూ కూడా కొంత సందేహమే. ఎందుకంటే కేసీఆర్‌ను మించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంకెవరు ఉంటారనేది చాలా మంది అభిప్రాయం. అది నిజమే కావొచ్చు కానీ మారుతున్న రాజకీయానికి తగ్గట్లుగా మారాలన్న స్ట్రాటజీ కూడా కేసీఆర్ కు ఉందని తాజాగా వెల్లడయింది. నిజంగానే పీకే సలహాలతోనే ఆయన రాజకీయం నడుస్తోందని తాజాగా వెల్లడయింది. ప్రశాంత్ కిషోర్ శనివారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సుమారు నాగు గంటల పాటు చర్చలు జరిపారు. వీరి మధ్య భేటీలో మరొకరు కూడా పాల్గొన్నారు. ఆ మరొకరు .. ప్రకాష్ రాజ్.
ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు - ప్రకాష్ రాజ్ అమలు !
కేసీఆర్ పీకేతో జరిపిన చర్చల్లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. యూపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి..? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి..? ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది ? జాతీయ రాజకీయాల్లో అందరూ ఏ క తాటిపైకి రావాలంటే ఏం చేయాలి వంటివాటిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలను ఏకం చేసేలా సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ తరపున.. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తరపున తీసుకోవాల్సిన బాధ్యతలపై ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తిగా ప్రకాష్ రాజ్‌కు ప్రశాంత్ కిషోర్ టీం దిశానిర్దేశం చేయనుందని చెబుతున్నారు. ఏం చేయాలి..? ఎలా చేయాలి..? ఎలాంటి వ్యూహాలు అవలంభించాలన్నదానిపై కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు ప్రకాష్ రాజ్ కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తారు. దానికి తగ్గట్లుగా ప్రకాష్ రాజ్ అమలు చేస్తారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రతినిధి ప్రకాష్ రాజేనా !?
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తరపున ప్రకాష్ రాజే ప్రతినిధిగా ఉండటం దాదాపు ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ముఖ్య సమన్వయకర్తగా ప్రకాష్ రాజ్ ఉండటం ఖాయమైపోయిందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. నిజానికి టీఆర్ఎస్‌లో ఢిల్లీ వ్యవహారాల్ని చక్కబెట్టడానికి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బోయిన్ పల్లి వినోద‌్ కుమార్ వంటి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ తన జాతీయ రాజకీయాల దృక్పథాన్ని భిన్నంగా ఢిల్లీలో ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. అందుకే బీజేపీ అన్నా.. బీజేపీ విధానాలన్నా విరుచుకుపడే ప్రకాష్ రాజ్ సరైన వ్యక్తిగా కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ కూడా అదే భావనతో మద్దతిచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రశాంత్ కిషోర్.. ప్రకాష్ రాజ్ ... కేసీఆర్ కటౌట్‌తో జాతీయ రాజకీయాల్ని మార్చేస్తారా ?
ప్రశాంత్ కిషోర్ ఇప్పుడో మిషన్ మీద ఉన్నారు. ఆ మిషన్ బీజేపీని, ప్రధాని మోదీని అధికారానికి దూరం చేయడం. అందుకే ఆయన రకరకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని గుప్పిట పట్టి తన రాజకీయం తాను చేయాలనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చేయడంతో ఆయన ఇప్పుడు భిన్నమైన మార్గాలు వెదుకుతున్నారు. మొదటగా మమతా బెనర్జీని తెర ముందుకు తెచ్చారు. కానీ ఎందుకో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా పీకే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలనే హైలెట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం.. పీకే కూడా అదే ప్రణాళిక బెటర్ అని అంచనా వేయడంతో చివరికి దానికి ఎగ్జిక్యూట్ చేయగలిగే గ్రామర్, గ్లామర్ ప్రకాష్ రాజ్‌కు ఉంటుందని డిసైడయినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ కటౌట్‌తో పీకే తెర వెనుక.. ప్రకాష్ రాజ్ తెర ముందు జాతీయ రాజకీయాల్ని నడపబోతున్నారన్న విషయం క్లారిటీ వచ్చింది.
కేసీఆర్ జాతీయ రాజకీయ ప్లాన్ రెడీ అయింది. వ్యూహకర్త.. ప్రధాన పాత్రధారి కూడా సిద్ధమయ్యారు. ఇక రాజకీయాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు అసలు స్టోరీ. అది సక్సెస్ అయితే .. దేశ రాజకీయాల కథే మారిపోతుంది. కానీ అదంత సులువు కాదు. కానీ అసాధ్యమూ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో అసాధ్యమైనదీ ఏదీ లేదు. ఇది అందరి కంటే కేసీఆర్‌కే ఎక్కువ అనుభవం.