Mahabubnagar BRS Candidate: మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మరో ఛాన్సిచ్చిన కేసీఆర్
Manne Srinivas Reddy: మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్.
Manne Srinivas Reddy as Mahabubnagar BRS MP Candidate: హైదరాబాద్: మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas Reddy)కి కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. 2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణపై 56,404 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారని తెలిసిందే.
స్పష్టత రాని నాగర్ కర్నూల్ స్థానం?
నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్నవారిని మళ్లీ చేర్చుకోవద్దని గులాబీ బాస్ ను నేతలు కోరారు. అయితే పార్టీని వదిలి వెళ్తున్న వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. అయితే బీఎస్పీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న దానిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ మీడియాకు తెలిపారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ రిజర్వుడ్ అయిన నాగర్ కర్నూల్ నుంచే బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.