TDP Politics : కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్, భవిష్యత్ కార్యాచరణపై రేపు కీలక సమావేశం!
TDP Politics : టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి విషయంలో కృష్ణా జిల్లా నేతలు సరిగ్గా స్పందించలేదని చంద్రబాబు క్లాస్ తీసుకోవడంతో నాయకుల్లో చలనం వచ్చింది. రేపు జిల్లా నేతలందరూ సమావేశం అవుతున్నారు.
TDP Politics : ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏం జరుగుతోంది. తెలుగు తమ్ముళ్లు ఎందుకు యాంగ్రీగా ఉన్నారు. నాయకులు పట్టించుకోవటం లేదని కార్యకర్తలు ఆవేదనతో ఉంటే, అధినేత సైతం నాయకత్వంపై చురకలు అంటించారు. ఇలాగైతే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే చెన్నుపాటి గాంధీపై దారుణంగా దాడి జరిగితే ఎవ్వరూ కనీసం నిరసన తెలపలేదు. కారణం ఏంటంటే మాత్రం నాయకులు ఎవ్వరూ స్పందించలేదు. స్వయంగా చంద్రబాబు క్లాస్ తీసుకోవటంతో నిరసనలపై పార్టీ నేతలు దృష్టి సారించారు. అంతే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు సమావేశం కూడా ఏర్పాటుచేశారు. భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేయటంతో పాటు,పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
రేపు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీడీపీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి రెండు శాసనసభ స్థానాలు దక్కాయి. అందులో విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో గన్నవరం ఇప్పటికే చేజారిపోయింది. అక్కడ టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి చేరారు. దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ ఒక్కరు మాత్రమే టీడీపీలో ఉన్నారు. ఇక విజయవాడ ఎంపీ స్థానం కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది. అయితే అప్పుడప్పుడూ ఎంపీ కేశినేని నాని చేసే వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. అయినా పార్టీకి మాత్రం ఎంపీ నాని విధేయుడిగానే కొనసాగుతున్నారు. చంద్రబాబుకు బోకే ఇచ్చే విషయంలో ఆయన నారాజ్ అయినట్లుగా కనిపించినప్పటికీ ఆ తరువాత విజయవాడలో జరిగిన చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనలో ఆయన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలసి గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఖుషిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితులపై ఇప్పుడు నాయకులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశాన్ని కూడ ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రులు, నాయకులు అంతా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.
కొడాలి నానిపై ఎదురుదాడి
ఇటీవల కాలంలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబుతో పాటు లోకేశ్ ను ఉద్దేశించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు కంట తడిపెట్టిన విషయం కూడా పార్టీ వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతుంది. ఇలా వరుసగా రాజకీయంగా కామెంట్స్ తో ఢీకొనలేక, వ్యక్తి గతంగా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆదివారం మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ నాయకులను పోలీసులు దారిలోనే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయటంతో పాటు, నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : Minister Dharmana: జనసేన, టీడీపీ కలిసే ఎన్నికలకు వెళ్తాయ్, రాసి పెట్టుకోండి - మంత్రి ధర్మాన