(Source: ECI/ABP News/ABP Majha)
KCR National Party : జాతీయ పార్టీపై ముందుకే కేసీఆర్ - దసరా రోజున పార్టీ పేరు ప్రకటన !?
దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఆ రోజున పార్టీ పేరు ప్రకటించి.. తర్వాత బహిరంగసభ నిర్వహించి జెండా, అజెండాను ప్రకటించే అవకాశాలున్నాయి.
KCR National Party : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ మళ్లీ సందిగ్ధంలో పడిందన్న ప్రచారం ప్రారంభం కాగానే ఆ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఓ వైపు దసరా ముంచుకు వస్తుంది. మరో వైపు ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ సారి పార్టీ ప్రకటన లేకపోతే ఇక ఎన్నికలపైనే కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ వర్గాలు నిర్ణయించుకున్నాయి. దసరాకు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటించబోతున్నారని మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసేశారని .. పార్టీ ప్రకటన మాత్రమే మిగిలిందని చెబుతున్నారు.
దసరా నాడు 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రకటన ఆషామాషీగా చేయడం లేదు. అదే రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తారు. అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఏకాభిప్రాయం మేరకు... పార్టీ ప్రకటన ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్వయంగా తీర్మానాలు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు కీలక నేతలు.., కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటనలు చేస్తున్నారు.
త్వరలో బహిరంగసభలో జెండా, ఎజెండా ప్రకటన
గతంలో జాతీయ నేతలందర్నీ పిలిచి కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ప్రకటన చేయాలనుకున్నారు కేసీఆర్. అయితే ఈ సారి పార్టీ పరమైన ప్రకటన మాత్రం ముహుర్తం ప్రకారం చేసి ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. త్వరలో కరీంనగర్‌లో బహిరంగసభ నిర్వహించి బీజేపీయేతర సీఎంలను అందర్నీ పిలిచి.. ఆ వేదికపై జాతీయ పార్టీ విధివిధానాలను ప్రకటించే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరును దసరా రోజున ప్రకటించి.. బహిరంగసభలో జెండా, అజెండాను ప్రకిటంచే అవకాశాలు ఉన్నాయి.
ఆటంకాలు ఎదురైనా ముందుకే వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటితో కూటమి కట్టడం ద్వారా ఆయన ఢిల్లీ రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు తమ తమ రాష్ట్రాల్లో.. తమ పార్టీల ప్రయోజనాల పరంగా చూసుకుని ఎక్కువగా జాతీయ పార్టీలతో కలిసేందుకే మొగ్గు చూపుతున్నాయి. ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ముందుకు రావడం లేదు. దీంతో కేసీఆర్ సొంతంగా జాతీయ పార్టీ పెట్టి.. రైతు ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. పూర్తిగా రైతు సంఘాల నేతలే కేసీఆర్ జాతీయ పార్టీకి కీలకంగా వ్యవహరించనున్నారు. పార్టీ స్వరూపం ఎలా ఉంటుందో.. దసరా రోజున కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ప్రకటన తర్వాతకేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించే అవకాశాలున్నాయి.
చిక్కుల్లో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్- విచారణ ఆరునెలల్లో పూర్తి చేయాలని సుప్రీం డైరెక్షన్