AP Politics: ఏపీలో సీటు కోసం బెంగళూరులో నేతల పాట్లు
రాయలసీమ జిల్లాలోని వైకాపా సీట్లు డిసైడ్ చేసేది కర్ణాటక బడా నేతలేనా..? టిక్కెట్ల కోసం బెంగళూరులో ప్రదిక్షణలు చేస్తున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావుడి కర్ణాటకలో కనిపిస్తోంది. ఓట్లు వేయమని అక్కడకి వలస వెళ్లిన వాళ్లను రప్పించే హడావుడి కాదు... ముందు సీటు దక్కించుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ సీటు దక్కించుకోవాలంటే కర్ణాటకలోని కొందరు నేతలను ప్రసన్నం చేసుకోవాలట. అప్పుడే ఇక్కడ సీటు చిరిగిపోకుండా భద్రంగా ఉంటుంది. అంతేనా అవసరమైతే వేరే వాళ్ల సీటును చింపేసి ప్రసన్నం చేసుకున్న వాళ్లకు ఇచ్చేస్తారు.
పక్క రాష్ట్రాల నేతల పెత్తనం
రాయలసీమలో ఓ ప్రధాన పార్టీ సీట్లను సరిహద్దు రాష్ట్రంలోని ఓ బడా నేత డిసైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరికి చెబితే వారికే టిక్కెట్లు దక్కుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆశావహులంతా అధిష్టానం వద్దకు కాకుండా ఆ బడా నేత ఇంటి వద్ద క్యూ కడుతున్నారని తెలిసింది. దీంతో టిక్కెట్స్ వచ్చిన వారు జోష్ లో ఉంటే.. టికెట్ దక్కని వారు మాత్రం ఆ రాష్ట్ర నేతలపై కసితో రగిలిపోతున్నారు. ఐదేళ్లు కష్టపడి నానా తంటాలు పడి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేస్తే....చివరి నిమిషంలో వచ్చి ఈ విధంగా గద్దల్లా టిక్కెట్లు తన్నుకుపోవడంతో ఆ ప్రధాన పార్టీపైనా నేతలు గుర్రుగా ఉన్నారని తెలిసింది.
ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాపై సరిహద్దు రాష్ట్రామైన కర్ణాటక (karnataka) ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అనంత జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో చాలామంది కన్నడ మాట్లాడమే కాదు. అక్కడి రాజకీయ ప్రభావం, రాజకీయ నేతల ప్రభావమూ ఉంటుంది. వారు ఏ చిన్న పని కావాలన్నా... బెంగళూరు( Bangalore), బళ్లారి వైపే చూస్తుంటారు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈసారి కర్ణాటక నేతల ప్రభావం అనంతపురం, కర్నూలు(Kurnool) జిల్లాపై కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ టిక్కెట్లు అన్నీ దాదాపు ఆ రాష్ట్ర నేతలు చెప్పిన వారికే దక్కాయని వినికిడి. హిందూపురం,(HINDHUPUR) రాయదుర్గం, గుంతకల్, ఉరవకొండ, మడకశిర, ఈ ప్రాంతాలలో ఆ రాష్ట్ర నేతలు ఎవరి పేరు సూచిస్తే వారికే ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వైకాపా సీట్లపైనే అధిక ప్రభావం
వైసీపీ అధినేత జగన్(Jagan ) తో కర్ణాటకకు చెందిన భాజపా, కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు ఎవరికి చెబితే ఆయన వారికే టిక్కెట్లు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఎన్నికల ఖర్చు మొత్తం తామే పెట్టుకుంటామని ఆయా నేతలు భరోసా ఇస్తుండటంతో వైసీపీ అధినాయకత్వం కూడా కాదనలేకపోతోంది. అందులో భాగంగానే రాయదుర్గం వైసీపీ టిక్కెట్టు మెట్టు గోవిందరెడ్డి (Mettu Govidn Reddy) దక్కించుకున్నారని టాక్...వైసీపీ ఆవిర్భావం కన్నా ముందు నుంచే జగన్ వెంట నడుస్తున్న కీలక నేత కాపు రామచంద్రారెడ్డి ( kapu Ramchandra Reddy)ని సైతం కాదని గోవిందరెడ్డిని ఇంఛార్జిగా జగన్ నియమించారు. మడకశిర వైసిపి అభ్యర్థి ఈర లక్కప్ప, హిందూపురం వైసిపి ఇన్చార్జ్ దీపిక, వీరంతా కూడ ఆ కేటగిరీ లో సీట్లు సాధించిన వారే...అయితే గతంలో కాపురామచంద్రారెడ్డి సైతం కర్ణాటక నేతల లాబీయింగ్ ద్వారానే వైసీపీ సీటు సాధించాడని తెలుస్తోంది.
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి (Gali Janardan Reddy) తో సంబంధాలు తెగిపోవడంతో ఆయన సీటు చిరిగిపోయిందట. హిందూపురం వైసిపి ఇంచార్జ్ దీపిక.. ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో వ్యాపార సంబంధాలు కారణంగా అక్కడి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేశారు. ఈర లక్కప్ప సైతం కర్ణాటకకు చెందిన బడా వ్యాపారవేత్త శివ కుమార్ సూచనతో రేసులో ముందుకు వచ్చారట. ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ కర్ణాటక మాజీమంత్రి శ్రీరాములకు (Sriramulg) స్వయంగా సోదరి. గాలి జనార్ధన్‌రెడ్డి ఆశీస్సులతోనే ఈ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది. మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanuru Jayram) ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో సీఎం జగన్ ఒత్తడి తెస్తున్నారు. దీంతో ఆయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva kUmar) ద్వారా లాబీయింగ్ చేయించడంతో...ఆయన స్థానంలో ఇప్పుడు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కర్నూలు మేయర్ రామయ్యను వైకాపా అధిష్టానం నియమించింది. తాము చెప్పిన నేతలకు టిక్కెట్లు ఇప్పించుకోవడమే కాదు....అధికార పార్టీలో మార్పులు, చేర్పులు సైతం అక్కడి నేతలే డిసైడ్ చేస్తుండటంతో రాయలసీమవాసుల్లో చర్చకు దారి తీసింది.
పెండింగ్ సీట్లపైనా గురి
ఇప్పటికే ప్రకటించిన సీట్లతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఇంకా ప్రకటించాల్సిన సీట్లపైనా కర్ణాటక నేతలు కన్నుపడింది. ఇప్పటికే పలు సిఫార్సు లేఖలు వైసీపీ అధిష్టానం వద్దకు చేరాయని వినికిడి. దీంతో రాయలసీమలో టిక్కెట్ ఆశీస్తున్న వారంతా తాడేపల్లి కాకుండా బెంగళూరు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.