KCR National Party : జాతీయ గుర్తింపు కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్- ఈశాన్య రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సత్తా చాటబోతోందా ?
బీఆర్ఎస్ ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయబోతోందా ? వీలైనంత త్వరగా జాతీయ హోదా తీసుకురావాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారా ?
KCR National Party : ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చానని కేసీఆర్ ఆషామాషీగా అనడం లేదని.. ఆయన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయవర్గాలు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు వస్తున్నాయి. జాతీయ హోదా పొందడానికి ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలను పక్కాగా అమలు చేసి .. జాతీయ హోదా పొందడానికి కేసీఆర్ పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జాతీయ పార్టీ గుర్తింపు కోసం ఈశాన్యం నుంచే కేసీఆర్ ప్రయత్నాలు ?
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. మూడు ఈశాన్యరాష్ట్రాల్లో పోటీ చేస్తే.. బీఆర్ఎస్ నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసినట్లవుతుంది. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. స్థానిక నేతల్ని చేర్చుకుంటే సులువే. ఎందుకంటే అక్కడి ఓటర్లు చాలా తక్కువ. అలా చేస్తే నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీగా గుర్తింపు వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా జాతీయ పార్టీ గా బీఆర్ఎస్‌కు గుర్తింపు లభిస్తుంది. ఈ ప్లాన్ తో కేసీఆర్ ముందడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్‌తో ఈశాన్య రాష్ట్రాల నేతలు మంతనాలు
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అక్కిడ నేతలు వచ్చి టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వేయబోయే తొలి అడుగు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉండేటట్లుగా చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల నాగాలాండ్‌కు చెందిన కొంత మంది కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది కీలక నేతలతోనూ చర్చలు జరిపారు. షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై సులంతుంగ్ హెచ్ లోథా వారం రోజుల కిందట మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. తాను నాగాలాండ్ ఎన్సీపీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తానని ప్రకటించారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ..నాగాలాండ్‌లో బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సైతం హాజరైన ఆయన కేసీఆర్ నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రివర్స్‌లో బీజేపీకి త్రిపుర ప్లాన్ అమలు చేసే ప్లాన్‌లో కేసీఆర్ !
ఎన్నికలు అంటే ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కోవాలంటే.. బలం కావాలి.. ఆ బలం తాము కల్పిస్తామని .. తమ పార్టీ తరపున పోటీ చేయాలని బీఆర్ఎస్ నుంచి త్రిపురలోని కొంత మంది సీనియర్ నేతలకు ఆఫర్లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. త్రిపుర నుంచి కొంత మంది సీనియర్ నేతలు హైదరాబాద్ వచ్చి చర్చలు కూడా జరిపారని చెబుతున్నారు. ప్రస్తుతం త్రిపుర బీజేపీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతోనూ బీజేపీ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. కొంత మంది సీనియర్ నేతల్ని చేర్చుకుంటే బీఆర్ఎస్‌కు ఓట్ల శాతంతో పాటు కొన్ని సీట్లు కూజా వచ్చే చాన్స్ ఉంది.
మేఘాలయలో బలమైన కూటమిలో భాగం అయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం !
మేఘాలయలో సరైన ప్రతిపక్షం లేదు. అలాగని ఒకే పార్టీ అధికారంలోకి వచ్చేంత సింపుల్ రాజకీయం కూడా అక్కడ లేదు. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పార్టీ తరపున కన్రాడ్ సంగ్మా సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీని దూరం పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో రెండు అంటే రెండు స్థానాలను మాత్రమే బీజేపీ గెల్చుకుంది. మేఘాలయలోనూ బీఆర్ఎస్ పోటీ ఉంటుందని.. సంచలనాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్‌ను మార్చిన తరవాత ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈశాన్యం నుంచే కేసీఆర్ తొలి అడుగు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ కేసీఆర్ ప్రణాళికలు అనుకున్నట్లుగా సాగితే.. లోక్ సభ ఎన్నికలకు ముందే జాతీయ పార్టీ హోదా వచ్చేస్తుంది.