BJP South Tension : దక్షిణాదిలో బీజేపీ ఆశలు ఎంత వరకూ ఫలిస్తాయి ? తెలంగాణలో లక్ష్యం చేరుకుంటుందా ?
దక్షిణాదిన బీజేపీ పరిస్థితి మెరుగుపడిందా ?కీలక రాష్ట్రాల్లో బలపడాలన్న అడుగులు ముందుకు పడుతున్నాయా ?సౌత్‌లో లోక్ సభ సీట్లు పెంచుకోగలరా ?
BJP South Tension : బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో మాత్రం రెండు, మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎదురీదుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాదిలో బీజేపీ పరిస్తితి ఏమిటన్నదానిపై ఆ పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో అనుకున్నంత బలంగా మారారా ?
రాష్ట్రం విడిపోయిన తరవాత తెలంగాణలో బీజేపీ బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలు దక్కించుకున్నా.. అభ్యర్థుల వల్లే గెలుపు సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ పుంజుకుంటే మునుగోడు ఉప ఎన్నికలో ఎందుకు గెలవలేదనే చర్చ ఉంది. ఓట్ల శాతం పెరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అన్ని నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అంటే చెప్పడం కష్టం. అందుకే ఈ సారి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పడం కష్టమే.
కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవడం సాధ్యమేనా ?
కర్ణాటకలో బీజేపీ స్వతహాగా విజయం సాధించలేదు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. అదే బీజేపీకి మైనస్ అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికారం చేపడితేనే దక్షిణాదిన ఉన్న ఒక్క రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లవుతుంది. లేకపోతే కతష్టమవుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉంది. బీజేపీ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. పట్టు ఉన్న ప్రాంతాల్లో జేడీఎస్ కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తోంది.
మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి కష్టమే !
తమిళనాడు రాజకీయాల గురించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ అన్నాడీఎంతో బీజేపీ పొత్తులో ఉంది. కానీ అది వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీలో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా? అనే స్థాయిలో ఉంది. అక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సైలెంట్ రాజకీయం వారికి అంతుబట్టడం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశాలు అవుతుండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికితోడు పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు. కేరళలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అక్కడ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగిస్తోంది. కానీ, లెఫ్ట్ పార్టీలు కట్టడి చేస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా బీజేపీని ఆ రాష్ట్రంలో ఎదగనీయకుండా చేస్తోంది.
మొత్తంగా తెలంగాణలో బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో కూడా అనుకున్నంత ముందుకు వెళ్లడం లేదు. దక్షిణాదిన అసెంబ్లీ ఎన్నికలు కాకుండా కనీసం లోక్ సభ సీట్లు పెంచుకునే ప్రయత్నాలు కూడా కలసి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.