(Source: ECI/ABP News/ABP Majha)
TS Congress Groups : మళ్లీ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి ! టీ కాంగ్రెస్ ఏకతాటిపైకి రావడం అసాధ్యమేనా ?
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ గొడవలు బయటపడ్డాయి. రేవంత్ నల్లగొండ పర్యటనను కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. గ్రూపుల్ని నియంత్రించడం రాహుల్ వల్ల కూడా కాలేదని కాంగ్రెస్ నేతలు నిరాశ చెందుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా పైకి మాత్రమే కలసిపోయినట్లుగా కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు బయటపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించవద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కలసిమెలిసి పని చేస్తామని చెప్పిన మాటలన్నీ ఉత్తత్తివేనని తేలిపోయాయి. తమ జిల్లాలో తామే పహిల్వాన్లమని ఎవరూ రావొద్దని కోమటిరెడ్డి నేరుగా చెప్పారు. అయినా రేవంత్ రెడ్డి శుక్రవారం నాగార్జునసాగర్‌లో పర్యటిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి డుమ్మా కొడుతున్నారు. పీీసీ చీఫ్‌కు ఎక్కడైనా తిరిగే స్వేచ్చ ఉందని ఇతర నేతలంటున్నారు.
రేవంత్ నల్లగొండ పర్యటన అవసరం లేదన్న కోమటిరెడ్డి !
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ పోరాటం రాహుల్ గాంధీ కూడా ఆపలేరని తేలిపోయింది. వచ్చే నెలలో రాహల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అత్యంత భారీగా జన సమీకరణ చేసి పట్టు చూపించాలని ... కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జన సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండలోనూ కార్యకర్తలతో సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష అవసరం లేదని కోమటిరెడ్డి అంటున్నారు. కేంద్రమంత్రి గడ్కరీ వస్తున్నందున తాను ఆయనతో పాటు పర్యటిస్తున్నానని.. కాంగ్రెస్ సమీక్షకు రావడం లేదన్నారు.
రేవంత్ పర్యటనపై రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు !
పీసీసీ చీఫ్ పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇటీవల స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు. ఈ కారణంగా తాను రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు పీసీసీ చీఫ్ మాత్రం తన జిల్లాలో పర్యటించవద్దని ఆయన నేరుగానే చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పార్టీ బలహీనంగా ఉందని అక్కడ పర్యటించాలని అంటున్నారు. కోమటిరెడ్డి కి వ్యతిరేకంగా ఉండే నల్లగొండ నేతలు రేవంత్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌కు ఎక్కడైనా పర్యటించే అధికారంఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. మరో వైపు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ బలహీనంగా ఉన్నజిల్లాల్లో పర్యటించాలని కోమటిరెడ్డి సూచించారని అంటున్నారు.
కలసి పని చేస్తామని చెప్పిందిపైపై మాటలకేనా !?
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి గతంలో దళిత - గిరిజన దండోరాను నిర్వహించాలనుకున్నారు. కోమటిరెడ్డి ఎంపీగా ఉన్న భువనగిరి నియోజకవర్గంలో సభ పెట్టాలనుకున్నారు. కానీ కోమటిరెడ్డి వద్దే వద్దనడంతో చివరికి సభా వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో రేవంత్ నాయకత్వాన్ని కోమటిరెడ్డి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కలిసి పని చేస్తామని అంటున్నారు. అయినప్పటికీ పీసీసీ చీఫ్ హోదాలో నల్లగొండ జిల్లాలో పర్యటింవద్దని కోమటిరెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌లో ఈ గ్రూపు తగాదాలకు ముగింపు పడే చాన్సే లేదని క్యాడర్ నిరాశపడుతున్నారు.