Suresh Gopi: కేంద్ర మంత్రి పదవి కోరుకోలేదు, సినిమాల్లో నటిస్తా - ప్రమాణ స్వీకారం తర్వాత నటుడు సురేష్ గోపీ షాకింగ్ కామెంట్స్
Suresh Gopi: కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించిన సురేష్ గోపి.. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఇప్పుడు ఆయన తన మంత్రి పదవిని వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Suresh Gopi: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మలయాళ నటుడు సురేశ్ గోపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ పోరులో సమీప ప్రత్యర్థి సీపీఐ నేత వీఎస్ సునీల్ కుమార్‌పై దాదాపు 74 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తద్వారా కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు సంపాదించి మరో ఘనత సాధించారు. అయితే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఎంపీ సురేష్ గోపీ ఆ పదవిని వదులుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన మంత్రివర్గంలో సినీ నటుడు సురేశ్ గోపికి కూడా చోటు కల్పించారు. మోడీ తన ఎన్నికల ప్రచారంలో ‘‘త్రిసూర్ కు కేంద్ర మంత్రి పదవి, ఇది మోడీ హామీ’’ అంటూ పదేపదే ప్రస్తావించారు. చెప్పినట్లుగానే ఎంపీగా గెలిచిన సురేశ్ గోపిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీలో ఓ ప్రాంతీయ ఛానల్‌తో సురేష్ మాట్లాడుతూ.. తాను మంత్రి పదవిని అడగలేదని, త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానని భావిస్తున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
సురేశ్ గోపి మాట్లాడుతూ.. “నాకు ఎంపీగా పని చేయాలని ఉంది. నా స్టాండ్ అదే. నాకు కేబినెట్ బెర్త్ అక్కర్లేదు. కేంద్ర మంత్రి పదవిపై నాకు ఆసక్తి లేదని పార్టీకి చెప్పాను. నేను త్వరలో రిలీవ్ అవుతానని అనుకుంటున్నాను” అని అన్నారు. “నేను ఎంపీగా చాలా బాగా పనిచేస్తాను. ఇది త్రిసూర్ ప్రజలకు బాగా తెలుసు. నాకు సినిమాల్లో నటించాలని ఉంది. పార్టీని నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని చెప్పుకొచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సురేష్ గోపీ ఇప్పుడు తనకు నటన అంటే ఇష్టమని సినీ రంగాన్ని విడిచిపెట్టనని చెప్పడం చర్చనీయాంశగా మారింది. ఆదివారం ఢిల్లీకి బయలుదేరే ముందు, తిరువనంతపురం విమానాశ్రయంలో గోపి మీడియాతో కేబినెట్ బెర్త్ గురించి మాట్లాడారు. “ఇది మోడీ నిర్ణయం. ఆయన నాకు ఫోన్ చేసి ఉదయం 11.30 గంటలకు తన ఇంట్లో ఉండమని చెప్పారు. అంతకుమించి నాకు ఇంకేమీ తెలియదు. కేరళ రాష్ట్రానికి నేను ఎంపీగా పని చేస్తాను. ప్రచారం సందర్భంగా త్రిసూర్ ప్రజలకు నేను ముందే చెప్పాను'' అని అన్నారు.
సురేశ్ గోపి దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016లో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసినా నిరాశే ఎదురైంది. 2024లో జరిగిన ఎన్నికల్లో త్రిసూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకొని, కేరళ తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి నుంచి కేరళలో కమల వికాసం కొనసాగుతుందని సురేశ్ పేర్కొన్నారు.
Also Read: రాజమౌళికి మొదటి అవకాశం ఇచ్చింది రామోజీరావే అని తెలుసా?