Ramoji Rao - SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి మొదటి అవకాశం ఇచ్చింది రామోజీరావే అని తెలుసా?
Ramoji Rao - SS Rajamouli: రామోజీరావు ఎందరో ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన అవకాశం అందించిన వారిలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉన్నారు.
Ramoji Rao - SS Rajamouli: ఈనాడు గ్రూప్ సంస్థ ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. పాత్రికేయ, టీవి రంగంలో విప్లవాత్మక మార్పుకు విశేష కృషి చేసిన ఆయన.. జర్నలిజంలోనే కాకుండా సినీ రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. 'ఉషా కిరణ్ మూవీస్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. ఎన్నో డైలీ సీరియల్స్ రూపొందించారు. తద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ, టీవీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన అవకాశం అందించిన వారిలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఉన్నారు.
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. 100 ఏళ్ల భారతీయ సినిమాకు ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టిన జక్కన్న.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందు టెలివిజన్ రంగంలో పనిచేసాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఈటీవీ కోసం 'శాంతి నివాసం' అనే తెలుగు డైలీ సీరియల్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారనే విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రామోజీరావు సహకారంతో రూపొందించిన తెలుగు ధారావాహిక 'శాంతి నివాసం'. వర ముళ్ళపూడి రచయితగా పని చేసిన ఈ సీరియల్ కోసం రాజమౌళి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దర్శకుడిగా ఒకటిన్నర సంవత్సరాలు పనిచేశాడు. ఆ టైంలో రోజుకు 17 గంటలపాటు పని చేసే వాడినని, తన జీవితంలో ఎక్కువగా కష్టపడిన కాలం అదేనని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను ఏమి చేస్తున్నానో పెద్దగా ఐడియా లేనప్పటికీ, కష్టపడి వర్క్ చేయడం వల్ల పని రాక్షసుడనే పేరు తెచ్చుకున్నానని అన్నారు. అప్పుడు రామోజీరావుతో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత రోజుల్లో వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడేలా చేసింది.
ఇక 'శాంతి నివాసం' సీరియల్ సక్సెస్ అయిన తర్వాత 'స్టూడెంట్ నెం. 1' సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు ఎస్. ఎస్.రాజమౌళి. దీనికి పృథ్వీ తేజ కథ అందించగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, గజాల హీరో హీరోయిన్లుగా నటించారు. 'శాంతి నివాసం' నాటికలో కనిపించిన పలువురు నటీనటులను ఈ చిత్రంలో కీలక పాత్రలకు తీసుకున్నారు. 2001లో వచ్చిన ఈ మూవీ హిట్టవ్వడంతో జక్కన్న వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇలా ఎస్ ఎస్ రాజమౌళి సక్సెస్ ఫుల్ జర్నీలో రామోజీ రావు కూడా భాగం పంచుకున్నారు. అందుకే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివదేహాన్ని చూసి దర్శకుడు భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులందరితో కలిసి నివాళులర్పించారు. రాజమౌళి కంటతడి పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామోజీకి సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో రాజమౌళి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
"ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల కృషితో, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం 'భారతరత్న' పురస్కారం ప్రదానం చేయడం" అంటూ ఎస్. ఎస్. రాజమౌళి తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. ఆయనతో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
Also Read: రామోజీరావు.. బాలీవుడ్‌లోనూ బాద్‌షానే - ఆ స్టార్ కపుల్‌కూ లైఫ్ ఇచ్చారు!