Ramoji Rao: రామోజీరావు.. బాలీవుడ్‌లోనూ బాద్‌షానే - ఆయన నిర్మించిన హిందీ మూవీస్ ఇవే, ఆ స్టార్ కపుల్‌కూ లైఫ్ ఇచ్చారు!
Ramoji Rao: మీడియా మొఘల్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామోజీరావు.. తన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో కొన్ని హిందీ సినిమాలను కూడా నిర్మించారు. ఆ చిత్రాలేంటంటే...
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. 87 ఏళ్ళ వయసులో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మీడియా మొఘల్ గా పిలుచుకునే రామోజీ మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సినీ నిర్మాతగా, రామోజీ ఫిలిం సిటీ స్టూడియో నిర్వాహకుడిగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
రామోజీరావు 1983లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించి చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వంలో నరేష్, పూర్ణిమ హీరో హీరోయిన్లుగా 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమా తీసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మంచి కంటెంట్ తో కూడిన చిత్రాలనే నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో కలిపి ఆయన 60కి పైగా సినిమాలను నిర్మించారు. ఎందరో నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. హిందీలో రామోజీ ప్రొడ్యూస్ చేసిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
'నాచే మయూరి' (1986):
రామోజీరావు హిందీలో నిర్మించిన మొదటి చిత్రం 'నాచే మయూరి'. ఇది 1984లో ఆయన నిర్మాణంలో రూపొందిన డ్యాన్స్ బయోగ్రాఫికల్ మూవీ 'మయూరి' రీమేక్. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ప్రమాదంలో కాలు కోల్పోయిన భరతనాట్య నర్తకి సుధా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది? కృత్రిమ కాలు సాయంతో చివరికి విధిపై విజయం సాధించి మళ్లీ ఎలా డ్యాన్స్ చేసింది? అనేది ఈ సినిమాలో చూపించారు. టి. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధా చంద్రనే స్వయంగా నటించడం విశేషం. ఈ మూవీ తెలుగుతో పాటుగా బాలీవుడ్ లోనూ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.
'ప్రతిఘాట్' (1987):
ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన మరో హిందీ చిత్రం 'ప్రతిఘాట్'. ఇది 1985లో విజయశాంతి ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం 'ప్రతిఘటన' కు రీమేక్. ఎన్. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ రివేంజ్ డ్రామాలో సుజాతా మెహతా, చరణ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ లేడీ కాలేజ్ లెక్చరర్ తనకు జరిగిన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది ఈ చిత్ర కథాంశం. తక్కువ బడ్జెట్‌తో, స్టార్ క్యాస్టింగ్ లేకుండా తీసిన ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీసు వద్ద రూ. 8 కోట్లు వసూలు చేసి హిట్ గా నిలిచింది.
'తుజే మేరీ కసమ్' (2003):
దాదాపు 15 ఏళ్ళ తర్వాత రామోజీ రావు తిరిగి బాలీవుడ్ లో రూపొందించిన హిందీ మూవీ 'తుజే మేరీ కసమ్'. ఇది తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా 2000లో వచ్చిన 'నువ్వే కావాలి' చిత్రానికి రీమేక్. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన కె. విజయ భాస్కర్ ఈ రొమాంటిక్ డ్రామాకు దర్శకత్వం వహించారు. రియల్ లైఫ్ కపుల్ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా ఈ చిత్రం ద్వారానే తెరంగేట్రం చేసారు. సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ కు బాలీవుడ్ డెబ్యూ ఇది. తెలుగులో మాదిరిగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది.
'తోడా తుమ్ బద్లో తోడా హమ్' (2004):
ఆర్య బబ్బర్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తోడా తుమ్ బద్లో తోడా హమ్'. ఎస్మాయీల్ ష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు. ఇది ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన డైరెక్ట్ హిందీ మూవీ. దీని తర్వాత ఈ బ్యానర్ లో మరో బాలీవుడ్ మూవీ రాలేదు.