Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Train Accidents In India | రైల్వే శాఖ ఏఐ ఎనేబుల్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS) ద్వారా ఏనుగులు, ఇతర జంతువులు రైల్వే ట్రాక్ మీద ప్రమాదాలకు గురవకుండా నివారించాలని భావిస్తోంది.

Indian Railways | డిసెంబర్ 20 (శనివారం) ఉదయం అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సారాంగ్- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఓ ఏనుగుల గుంపును ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 7 ఏనుగులు మరణించాయి. ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత, రైల్వేశాఖ ఇప్పుడు వన్యప్రాణుల రైలు ఢీకొనే సంఘటనలను తగ్గించే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయం తీసుకోవాలని భావిస్తోంది.
రైల్వే ట్రాక్‌లపై ఏనుగులు, ఇతర వన్యప్రాణులను ఢీకొనడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీని కింద, రైల్వేలు డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (DAS) ఆధారంగా AI ఎనేబుల్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS) ను అమలు చేస్తారు. ఇది రైల్వే ట్రాక్‌ల చుట్టూ ఏనుగులు లేదా ఇతర వన్యప్రాణుల ఉనికిని గుర్తించి, లోకో పైలట్‌కు సకాలంలో అలర్ట్ జారీ చేస్తుంది.
ఈశాన్య రైల్వేలో పైలట్ దశలో ఈ ప్రాజెక్ట్
ఏఐ టెక్నాలజీ వినియోగించే ఈ ప్రాజెక్ట్ ఈశాన్య రైల్వేలో పైలట్ దశలో ఉంది. ఈ AI-ఆధారిత ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS) మొదట ఈశాన్య సరిహద్దు రైల్వే (Northeast Frontier Railway) 141 రూట్ కిలోమీటర్ల ప్రాంతంలో అమలు చేశారు. దీని లక్ష్యం ఏనుగులు, ఇతర జంతువుల గుంపును ఢీకొనే సంఘటనలను నివారించడం, ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేసిన తర్వాత సానుకూల ఫలితాలు చూస్తామని అధికారులు చెబుతున్నారు. తరువాత రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా ఏఐ ఎనేబుల్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS) ను అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ వ్యవస్థను 1,122 రూట్ కిలోమీటర్ల వరకు విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ విజయం ఆధారంగా, రైల్వేలు 981 రూట్ కిలోమీటర్ల కోసం కొత్త టెండర్లను కూడా జారీ చేశాయి. AI-ఆధారిత ఈ భద్రతా వ్యవస్థ మొత్తం కవరేజ్ 1,122 రూట్ కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యవస్థ రైల్వే ట్రాక్‌ల చుట్టూ జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఏనుగుల శబ్దాలు, ఇతర జంతువుల అరుపులు, ప్రకంపనలను గుర్తించి వెంటనే లోకో పైలెట్‌కు హెచ్చరికను జారీ చేస్తుంది. అదనంగా AI-ఆధారిత కెమెరాలు, సెన్సార్ల సహాయంతో, లోకో పైలట్‌లకు అర కిలోమీటర్ ముందుగానే హెచ్చరిక అందుతుంది. స్టేషన్ మాస్టర్, కంట్రోల్ రూమ్‌కు కూడా రియల్-టైమ్ హెచ్చరికలు పంపుతుంది. దీనివల్ల సకాలంలో రైలు వేగాన్ని తగ్గించడం లేదా ఆపడం వంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవచ్చు.






















