TDP Assembly : బడ్జెట్ సమావేశాలకు టీడీపీ హాజరు - చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు వెళ్లాలని నిర్ణయం !
చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ ఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వదులుకోకూడదని టీడీపీ ( TDP ) నిర్ణయించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును ( Chandrababu ) తీవ్ర అవమానానాల పాలు చేస్తూండటంతో ఆయన కంటనీరు పెట్టుకుని మళ్లీ సీఎంగానే వస్తానని చాలెంజ్ చేసి వెళ్లారు. ఇక టీడీపీ సమావేశాలను బహిష్కరిస్తుందా ఇక వెళ్లదా అన్న చర్చలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు కొండలా కళ్ల ముందు కనిపిస్తున్న సమయంలో అసెంబ్లీకి ( Assembly ) వెళ్లకపోవడం మంచిది కాదన్న అభిప్రాయంతో సభకు వెళ్లాలని నిర్ణయించారు.
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ ( TDLP ) సమావేశంలో సభకు హాజరయ్యే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. గతంలో ఎన్టీఆర్ ( NTR ) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా.. ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిందని చంద్రబాబు ( Chandrababu ) గుర్తుచేశారు. సమావేశాలకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, పైగా కెమెరాల్లో తమను చూపించడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారు. ఇప్పటికే టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు ( Achennaidu ) , రామానాయుడు ( Ramanaidu ) కు మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు సిఫారసు చేసింది.
ప్రభుత్వం ఎంత దిగజారిపోయినా ఆ విషయాన్ని ప్రజల్లో పెట్టేందుకైనా సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మార్చి7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ( Assembly Budget Sessions ) జరగనున్నాయి. ప్రజల పక్షాన బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతు విప్పాలని చంద్రబాబు ఆదేశించారని తెలుగు దేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుపాటు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి శాసన సభ సంతాపం తెలపనుంది.
శాసన మండలి సభ్యులు కూడా సభకు హాజరు కానున్నారు. దీంతో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం తప్పిపోయినట్లయింది. ఈ సారి అసెంబ్లీలో అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై చర్చ పెట్టాలని అధికారపక్షం అనుకుంటోంది. దీంతో సమావేశాలు సీరియస్‌గా సాగే అవకాశం ఉంది.