Revanth Coterie: కోటరీ గుప్పిట్లో రేవంత్ - మంత్రుల కన్నా సన్నిహితులతోనే పనులు - అందుకే మంత్రివర్గంలో విభేదాలు?
Telangan CM : సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంతో కాకుండా తన కోటరీతో పనులు చక్క బెడుతున్నారు. ఆయన కోటరీలో ఇరుక్కుపోయారని.. అందుకే మంత్రులతో సంబంధాలు చెడిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

CM Revanth Reddy Coterie Domination: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల మధ్య పొసగని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉన్న 15 మంది మంత్రుల్లో సగం మంతి రేవంత్ పట్ల అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొంత మంది ఆయనపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది పరోక్షంగా రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డికి సన్నిహితులే. మరి ఇప్పుడెందుకు దూరం అయ్యారు అంటే..అందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం వినిపిస్తంది. అదే కోటరీ. రేవంత్ రెడ్డి చుట్టూ ఎప్పుడూ ఉండే కొంత మంది వ్యక్తుల వల్ల.. ఆయనకు మంత్రులు దూరమైపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తించడం లేదని అంటున్నారు.
తాజాగా కోమటిరెడ్డితోనూ పంచాయతీ.. !
కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు లతో పాటు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రిపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సినీ కార్మికుల అభినందన సభకు కోమటిరడ్డిని ఆహ్వానించలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తనకు సమాచారం లేకుండా రేవంత్ సన్మానం చేయించుకోవడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా సురేఖ తన ఓఎస్డీ సుమంత్ విషయంలో.. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆమె కుమార్తే నేరుగా సీఎంపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఓ టెండర్ విషయంలో జూపల్లి కృష్ణారావు పంచాయతీ పెట్టుకున్నారు. వీరంతా చెప్పే మాట ఒక్కటే.. నేరుగా రేవంత్ కాకపోయినా.. ఆయన చుట్టూ వారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ వల్లే సమస్యలు !?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా.. జూపల్లి కృష్ణారావు అయినా..కొండా సురేఖ అయినా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమను అవమానిస్తున్నారని చెబుతోంది.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై కాదు. ఆయన చుట్టూ ఉన్న మనుషులపై. సీఎంగా ఉన్న వ్యక్తి చుట్టూ పనులు చేపట్టడానికి కొంత మంది ఉంటారు. వారు సీఎంవోను మించి ఎక్కువ పెత్తనం చెలాయిస్తే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ అలాంటి వారు కొందరు ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరి నేతల పేర్లు ఎక్కుగా ప్రచారంలోకి వస్తున్నాయి. వారిలో ఒకరు వేం నరేందర్ రెడ్డి, మరొకరు రొహిన్ కుమార్ రెడ్డి. నరేందర్ రెడ్డికి సీఎం సలహాదారుగా అధికారిక పదవి ఉంది. రోహిన్ రెడ్డికి అలాంటి పదవి ఏమీ లేదు. కానీ అన్ని విషయాల్లోనూ వీరు జోక్యం చేసుకుంటున్నారని.. బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. కొండా సురేఖ కుమార్తె రొహిన్ రెడ్డి గురించి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆయనే సినీ పరిశ్రమ వ్యవహారాలను చూసుకుని కోమటిరెడ్డిని లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు.
రాజ్యాంగేతర శక్తులుగా మారారని విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి వివిధ మంత్రిత్వశాఖలు చేయాల్సిన పనులను.. తన సన్నిహితులకు.. అదీకూడా అధికారం లేని వారికి చేయమని పురమాయించడం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయని.. వారు రాజ్యంగేతరశక్తులుగా మరి చిక్కులు తెచ్చి పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న పొంగులేటి..రేవంత్ రెడ్డి చుట్టూ ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆయనకు బదులుగా.. ఇతరులు కనిపిస్తున్నాయి. ఆ కోటరీతో వస్తున్న సమస్యల వల్ల సీఎం ఇమేజ్ దెబ్బతింటోందన్న అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాల్లో ముఖ్య పదవుల్లో ఉండే వారి బలహీనత ఏమిటంటే.. తన చుట్టూ ఉన్న కోటరీపై బయట నుంచి చాలా విమర్శలు వస్తున్నా చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే వారిని తన నుంచి దూరం చేయడానికి చేస్తున్నారేమో అని వారనుకుంటారు. అలాగని తన చుట్టూ ఉన్న వారు చేస్తున్న పనులు ఆయన దృష్టికి పూర్తిగా రావు. దాని వల్ల అసలు నష్టం జరిగిన తర్వాతనే తెలుసుకోగలుగుతారు. ఏపీలో సీఎం జగన్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని.. ఒకప్పుడు కోటరీలో భాగంగా ఉండి.. తర్వాత కోటరీ కారణంగానే కనిపించకుండా పోయిన విజయసాయిరెడ్డి బాధపడ్డారు. ఇప్పుడు రేవంత్ కడా అదే అనుభవంతో జాగ్రత్తపడాలని ఎక్కువ మంది సలహాలిస్తున్నారు. మరి రేవంత్ కు ఈ అంశంపై స్పష్టత ఉందో లేదో మరి.





















