AP Cabinet Inside : మారకపోతే మార్చేస్తా - మంత్రులపై జగన్ ఫైర్ ! ఎందుకంటే ?
ఏపీ మంత్రులు ప్రతిపక్షానికి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని సీఎం జగన్ ఫీలవుతున్నారు. మారు మారకపోతే మార్చేస్తానని హెచ్చరించారు.
AP Cabinet Inside : కేబినెట్ సహచరులపై సీఎం జగన్‌కు కోపం వచ్చింది. మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత మంత్రులతో జగన్ కాసేపు మాట్లాడారు. ఇటీవలి కాలంలో విపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రులు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు విమర్శలు ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. లేదంటే మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆగ్రహంతో మంత్రులు మౌనంగా ఉండిపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేదని జగన్ ఆగ్రహం
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడంలో మంత్రులు విఫలమయినట్లుగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆనం వెంకటరమణారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డితో పాటు వైఎస్ భారతి హస్తం ఉందని ఆరోపించారు. ఆ తర్వాత పలువురు టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్‌సీపీ తరపున పలువురు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అయితే మంత్రులు మాత్రం పెద్దగా స్పందించలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ తర్వాత ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆరోపణలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తేడా వస్తే ఇద్దరు ముగ్గుర్ని మార్చడానికి కూడా వెనుకాడనని ఆయన ప్రకటించారు.
సీఎం జగన్ సతీమణిపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు
అయితే వైఎస్ఆర్‌సీపీ మంత్రులు మాత్రం తాము రెగ్యులర్‌గా విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నామని చెబుతున్నారు. మంత్రి రోజా దాదాపుగా ప్రతీ రోజూ టీడీపీ నేతలపై ఘాటుగా విమర్శలు చేస్తూంటారు. అయితే ఆమె ఇటీవలి కాలంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియాలోపర్యటన ముగించుకుని నేరుగా కేబినెట్ మీటింగ్ కోసం తాడేపల్లి వచ్చారు. ఈ కారణంగా టీడీపీ నేతలు చేసిన లిక్కర్ స్కాం ఆరోపణలపై స్పందించలేదని తెలుస్తోంది. మరో మహిళా మంత్రి వనిత కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై ప్రధానంగా స్పందించాల్సిన ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా స్పందంచకపోవడం సీఎం జగన్‌ను అసంతృప్తికి గురి చేసినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నయి.
మారకపోతే మార్చేస్తానంటున్న జగన్
సీఎం జగన్ వార్నింగ్‌లతో మంత్రులు అలర్ట్ అయ్యారు. అయితే వైఎస్ఆర్‌సీపీలో ఓ సంప్రదాయం ఉంది. మీడియాతో మాట్లాడమని పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప మాట్లాడారు. పార్టీ విధానాల గురించి అక్కడి నుంచే సమాచారం వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా సూచనలు వస్తాయి. సొంతంగా మాట్లాడితే.. వివాదాలు వస్తాయేమోనని ఎక్కువ మంది ఇబ్బంది పడుతూంటారు. తమకు మాట్లాడాలని సిగ్నల్స్ లేకపోవడం వల్ల మాట్లాడలేదని.. లేకపోతే.. తమ సత్తా చూపిస్తామని కొంత మంది మంత్రులు అంటున్నారు. మొత్తంగా జగన్ ఇచ్చిన హెచ్చరికలు మంత్రులు ఇక విపక్షాలపై విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.