CM Chandrababu: 'అలా అయితేనే పార్టీలో చేర్చుకుంటాం' - పార్టీలో చేరికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Andhra News: వైసీపీని వీడి టీడీపీలో చేరాలనుకునే వారిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు, పార్టీకి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని.. నేతల వ్యక్తిత్వం కూడా చూస్తామన్నారు.
CM Chandrababu Comments On Party Joinings: కొందరు నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాలని భావిస్తోన్న తరుణంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీని నడపడం కూడా ప్రమాదకరమేనని అన్నారు. అలాంటి పార్టీలో ఉండలేక టీడీపీలోకి రావాలని ఎవరైనా భావిస్తే అలాంటి వారు తమ పదవులు, పార్టీకి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. పదవులకు రాజీనామా చేసినా.. నేతల వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. కొందరు నేతల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని.. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అటు, అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు.
'త్వరలోనే పదవుల నియామకం'
సరైన స్థానంలో నాయకుడిని నియమించే ప్రక్రియలో భాగంగానే నామినేటెడ్ పదవుల భర్తీ కాస్త ఆలస్యం అవుతోందని చంద్రబాబు చెప్పారు. దీనిపై కసరత్తు పూర్తి కావొచ్చని.. త్వరలోనే పదవుల నియామకం ఉంటుందని ప్రకటించారు. సీట్ల కేటాయింపులో 3 పార్టీలు ఎలా సమన్వయంతో ముందుకెళ్లాయో.. అలాగే పదవుల పంపకాల్లోనూ సర్దుబాటు ఉంటుందని తెలిపారు. 'అధికారంలోకి వచ్చి 70 రోజులైనా నామినేటెడ్ పదవులు భర్తీ కావడం లేదనే అసంతృప్తి మా నాయకుల్లో కనిపిస్తోంది. కొందరు ఆశావహుల అంచనాలు భారీగా ఉంటున్నాయి. కానీ అందరినీ సంతృప్తి పరిచేలానే నిర్ణయాలు ఉంటాయి. అందరికీ ఉండే విధంగానే రోజులో 24 గంటల సమయమే నాకూ ఉంటుంది. మరో 25 రోజుల్లో అందరికీ శుభవార్త ఉంటుంది.' అని పేర్కొన్నారు.
వైసీపీకి షాకేనా..?
వైసీపీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అటు, రాజ్యసభ ఎంపీగా ఉన్న మోపిదేవి వెంకటరమణ సైతం వైసీపీని వీడనున్నట్లు సమాచారం. ఆయన గురు లేదా శుక్రవారాల్లో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వారికి చంద్రబాబు క్లాస్
మరోవైపు, బుధవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో అంతర్గతంగా పలు రాజకీయ అంశాలపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఈ మేరకు కొందరి వ్యవహారశైలి పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి చెడ్డ పేరే హైలెట్ అవుతోందని ఆయన అమాత్యులతో అన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వంద రోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందిస్తామని అన్నారు.
Also Read: Pawan Kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్, 12 వేల చీరలు పంపిన ఏపీ డిప్యూటీ సీఎం