Pawan Kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్, 12 వేల చీరలు పంపిన ఏపీ డిప్యూటీ సీఎం
Andhra Pradesh News | పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని మహిళలకు 12 వేల చీరలు పంపారు.
Pawan Kalyan News | పిఠాపురం ఎమ్మెల్యేనా.. మజాకా నా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం పై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గం లోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం 12 వేల చీరలను పిఠాపురం లోని ఆడపడుచులకు పంచేందుకు అంతా సిద్ధం చేశారు.
ఈ శుక్రవారం పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతం
ప్రతీ ఏడూ శ్రావణ మాసం చివరి శుక్రవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం లోని పురూహూతికా దేవలయం లో పెద్ద యెత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు మాతృమూర్తులు. అదే కోవలో ఈ ఏడాది కూడా ఆగష్టు 30 న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా వ్రతం కోసం వచ్చే మాతృమూర్తులకు తన సొంత ఖర్చులతో చీరలు పంచేందుకు రంగం సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీని కోసం ఇప్పటికే ఏకంగా 12 వేల చీరలను పితాపురానికి పంపించారు ఆయన. వీటిలో 6000 చీరలను పసుపు కుంకుమ తో కలిపి అమ్మవారి ప్రసాదం గా ఆలయం వద్ద పూజ ముగిసిన తర్వాత అందజేస్తారు.
మిగిలిన 6000 చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ ఆఫీను లో ఆడపడుచులకు ఇస్తారు. ఈ ఏర్పాట్లను పార్టీ కీలక నేత హరిప్రసాద్ స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ ఈవో భవాని ఈ ఏడాది గతంలో లా కాకుండా మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్యాచులుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు తగిన్ ఏర్పాట్లు చేసినట్టు ఆమె హరిప్రసాద్ కు చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యే గా ఎన్నికైన తొలి ఏడాదే పిఠాపురం మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ఏకంగా 12 వేల చీరలను పంచిపెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.