Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర!
Revanth Govt: రేవంత్ సర్కార్ వచ్చే శాసన సభ సమావేశాల్లో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తేనుంది. కలెక్టర్, ఉపసర్పంచ్ అధికారాలకు కోత పడనుంది. పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక అప్‌డేట్స్ చేయనుంది.
Telangana State Panchayat Raj Act 2018: తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు నగరా మోగనుంది. అయితే అది బీసీ కులగణన తర్వాతే. అందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో 12,992 పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ కాల పరిమితి ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంచుతామని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హమీ ఇవ్వడంతో అందుకు తగ్గట్టుగా ఇప్పుడు బీసీ కుల గణన జరుగుతోంది. ఈ సర్వే తర్వాత బీసీ జనాభా దామాష పద్దతిన పంచాయతీలు బీసీలకు రిజర్వే చేయనున్నారు. అయితే ఇందు కోసం పంచాయతీ రాజ్ బిల్లులో మార్పులు చేయాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా వచ్చే శాసనసభ సమావేశాల్లో పంచాయతీ రాజ్ బిల్లులో సవరణలు చేయనున్నారు. కేవలం బీసీ రిజర్వేషన్ల కోసమే కాకుండా మరి కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని పంచాయతీ రాజ శాఖ అధికారులు చెబుతున్నారు.
పంచాయతీరాజ్ బిల్లుకు సవరణలు ఇవే..
రిజర్వేషన్ల కాలపరిమితిలో మార్పు.
బీఆర్ఎస్ సర్కార్ హాయంలో అంటే 2018లో పంచాయతీ రాజ్ బిల్లు తీసుకువచ్చింది. అందులో పదేళ్ల కోమారు అంటే రెండు టర్మ్‌ల తర్వాతే రిజర్వేషన్ల మార్పుపై నిర్ణయం తీసుకునేలా చట్టంలో పేర్కొంది. అంతకు మునుపు ప్రతీ ఐదేళ్లకు రిజర్వేషన్లు మార్పు ఉండేది. కాని కేసీఆర్ హాయంలో దాన్ని పదేళ్లకు చేసింది. ప్రతీ ఐదేళ్లకు రిజర్వేషన్ల మార్పు వల్ల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని, అభివృద్ధి కుంటుపడుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ సర్కార్ దీన్ని ఐదేళ్లకు కుదించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు బిల్లులో మార్పులు తెచ్చేందుకు పంచాయతీ రాజ్ శాఖ సిద్దమవుతోంది.
కలెక్టర్ అధికారాలకు కోత
ప్రస్తుత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఉంది. అయితే సర్పంచ్‌లు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. వారిని తొలగించే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సర్పంచ్‌లు దీన్ని వ్యతిరేకించారు. ప్రజా ప్రతినిధులు ఈ అధికారాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు రేవంత్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. వచ్చే బిల్లులో ఈ మేరకు కలెక్టర్ అధికారాలకు కోత పడనుంది.
ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కట్టబెట్టింది. దీంతో పంచాయతీలో సర్పంచ్ ఏ పని చేయాలన్నా ఉప సర్పంచి సంతకం పెడితేనే నిధులు విడుదల అయ్యే పరిస్థితి. దీంతో చాలా పంచాయతీల్లో సర్పంచ్ ఓ పార్టీ వ్యక్తి అయితే, ఉప సర్పంచ్ మరో పార్టీ వ్యక్తి ఎన్నికవడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఆ పంచాయతీ అభివృద్ధి కుంటుపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఇవ్వడం ద్వారా సర్పంచ్ అవినీతికి పాల్పడకుండా ఉంటారన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చింది. అయితే దీనిపై సర్పంచ్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఇస్తే తమ పదవికి విలువ ఏంటని పార్టీ వేదికలపైన ప్రశ్నించిన సందర్భాలున్నాయి. వచ్చే బిల్లులో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేసే దిశగా పంచాయతీ రాజ్ బిల్లులో మార్పులున్నాయి. ఉప సర్పంచ్‌కు బదులు పంచాయతీ కార్యదర్శికి ఆ అధికారం ఇచ్చే అవకాశం ఉంది.
ముగ్గురు పిల్లల నిబంధన మార్చే అవకాశం.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు పోటీకి అనర్హులు. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో కార్పోరేటర్లకు, మున్సిపల్ ఛైర్మన్లకు ఇలాంటి నిబంధన లేదు. అదే రీతిలో కార్పోరేషన్లలో కార్పోరేటర్లకు, మేయర్ ఎన్నికకు ఈ నిబంధన లేదు. కేవలం పంచాయతీ రాజ్ చట్టంలోనే పేర్కొనడంపై విమర్శలు వచ్చాయి. దీన్ని మార్చాలన్న డిమాండ్ ఉంది. ఈ దఫా అసెంబ్లీసమావేశాల్లో ఈ దిశగా మార్పు ఉండే అవకాశం ఉంది. సర్పంచ్‌లకు ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయరాదన్న నిబంధన తొలగించి పోటీకి వెసులుబాటు కల్పించవచ్చు.
ప్రతీ మండలానికి కనీసం ఐదుగురు ఎంపీటీసీలు
ప్రతీ మండలంలో జనాభాను బట్టి ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. ప్రతీ ఐదు వేలమందికి ఓ ఎంపీటీసీ ఉండే అవకాశం ఉంది. అయితే మారిన జనాభా నిష్పత్తిని బట్టి ఎంపీటీసీల సంఖ్య పెరగలేదు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మండలాలు ఉన్నాయి. ఐదు కన్నా తక్కువ మంది ఎంపీటీసీలున్న మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ముత్యంపేట (22 ఎంపీటీసీలు), పెద్దపల్లి (21 ఎంపీటీసీలు) నాగర్ కర్నూల్ (20 ఎంపీటీసీలు), భద్రాచలం (20 ఎంపీటీసీలు) ఉన్నారు. అతి తక్కువగా నాగంగాపురం (4 ఎంపీటీసీలు) వంగర (4 ఎంపీటీసీలు), పస్రి (5 ఎంపీటీసీలు), తాడేపల్లి (5 ఎంపీటీసీలు),అదిలాబాద్ (5 ఎంపీటీసీలు) పాద్మానగర్ (5 ఎంపీటీసీలు) ఉన్నారు. అయితే ప్రతీ మండలానికి కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా పంచాయత్ రాజ్ చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.
Also Read: అభ్యంతరం లేకుంటే మృతదేహాలు అప్పగించండి - ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు కీలక కామెంట్స్