Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Bangladesh Riots Latest News In Telugu : బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు త్రిపురలో కౌంటర్ పడింది. ఇకపై బంగ్లా దేశీయులకు హోటళ్లలోకి అనుమతించకూడదని అసోసియేషన్ నిర్ణయించింది.
Tripura Bangladesh Latest News Today: బంగ్లాదేశ్‌లో అధికార అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ప్రధాని హసీనా పదవీచ్యుతురాలు అయిన తర్వాత అక్కడ మైనారీటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇస్కాన్ కు చెందిన సాధు చిన్మయ్ క్రిష్ణదాస్ అరెస్టుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈక్రమంలో త్రిపురలోని హోటళ్ల యాజమాన్యం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై బంగ్లాదేశీయులకు హోటళ్లలో అనుమతి నిరాకరించినట్లు త్రిపుర హోటల్, రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
నోటిఫికేషనల్ జారీ..
భారత ఈశాన్య ప్రాంతాల్లో సరిహద్దు రాష్ట్రమైన త్రిపుర.. మూడు వైపులా బంగ్లాతో సరిహద్దులు కలిగి ఉటుంది. ఈ రాష్ట్రంలోకి బంగ్లాదేశీయులు రాకపోకలు జరపడం మాములే. ఇక్కడ బంగ్లా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం కూడా ఉంది. అయితే బంగ్లాలో హిందువులపై దాడి నేపథ్యంలో ఇకపై బంగ్లా దేశీయులకు హోటళ్లలో వసతి కల్పించకూడదని అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు జరిపాలని ఆదేశించింది. అలాగే బంగ్లాదేశీయులకు ప్రవేశం నిరాకరిస్తూ హోటళ్ల రిసెప్షన్ ప్రాంతంలో వాల్ పేపర్లు ఉంచాలని సూచించింది.
హై కమిషన్ పై దాడి..
బంగ్లాలో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో స్థానికులు తీవ్రంగా స్పందించారు. అగర్తలాలోని బంగ్లా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం చేశారు. సుమారు 50మందికిపైగా నిరసనకారులు కమిషన్ క్యాంపస్ లోకి ప్రవేశించి ఆందోళన చేపట్టారు.
దాడిని ఖండించిన భారత్..
మరోవైపు బంగ్లా కమిషన్ పై దాడిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇలాంటి చొరబాట్లు సమ్మతం కాబోవని, ఇది తమను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించింది. దౌత్య, కాన్సులర్ ఆస్తులకు భద్రత కల్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని బంగ్లా హై కమిషన్, దౌత్య అధికారులకు భద్రతను మరింతగా పెంచుతున్నట్లు వెల్లడించింది. కాన్సులర్ ఆస్తులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయకూడదని, దౌత్య సంబంధాలను గౌరవించాలని విదేశాంగ శాఖ అప్పీల్ చేసింది.
బంగ్లా రెస్పాన్స్..
మరోవైపు భారత్ లోని హై కమిషన్ దాడిని ఖండిస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఆందోళనకారులు ప్రధాన గేటును బద్దలు కొట్టుకుని క్యాంపస్ లోకి ప్రవేశించారని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు తమదేశంలోని మైనారిటీలందరికీ భద్రతను కల్పించే బాధ్యతలను స్వీకరించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ సూచించింది. బంగ్లాలో హిందువులపై పెరుగుతున్న హింస, తీవ్రవాద పోకడలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
గతనెలలో కృష్ణ దాస్ అరెస్టు..
బంగ్లాదేశ్ లోని హిందూ హక్కుల కోసం పోరాడే సాధు చిన్మయ్ కృష్ణ దాస్ ని గతనెల25న ఢాకాలోని హజరత్ షాజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. ఆయన బంగ్లా సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. చట్టోగ్రామ్ లో జరిగే ఒక ర్యాలీకి అటెండ్ అయ్యేందుకు వెళుతున్న దాస్ ని.. ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన పోలీసులు, వెంటనే చట్టోగ్రామ్ ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్ ని నిరాకరించి, 26న జైలుకు తరలించారు.